ఎంత పని చేశావు తల్లీ!

24 Aug, 2020 10:44 IST|Sakshi
శిల్పా (ఫైల్‌)- జ్ఞానేశ్వరి (ఫైల్‌)

బిడ్డతో సహా నీటికుంటలోకి దూకిన తల్లి

ఇద్దరూ మృతి

భర్త దారి తప్పాడని మనస్తాపం

ఆలూరులో ఘటన

వినాయక చవితి నాడు విషాదం 

ఆలూరు రూరల్‌: భర్త దారి తప్పాడు. పెళ్లి ప్రమాణాలను మరచిపోయి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయినా ఆమె భరించింది. కానీ భర్త, అతని ప్రియురాలి వేధింపులు అధికమయ్యాయి. ఇక ఓర్చుకునే శక్తి లేకపోయింది. మూడేళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. తానొక్కతే చనిపోతే బిడ్డకు దిక్కు ఉండరన్న భయంతో ఆ చిన్నారినీ వెంట తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన వినాయక చవితి   పండుగ నాడు ఆలూరు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆలూరులోని గోవర్ధన్‌ టాకీస్‌ సమీపంలో నివాసముంటున్న ఏక్‌నాథ్‌ ఈరన్న, హైమావతి కుమారుడు నాగార్జునకు కర్ణాటకలోని శిరుగుప్ప తాలూకా దరూరు గ్రామానికి చెందిన చంద్రప్ప, వన్నూరమ్మ కుమార్తె శిల్పా (24)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్ఞానేశ్వరి (3) అనే కుమార్తె ఉంది. నాగార్జునకు పట్టణానికే చెందిన మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది.

ఏడాది క్రితం నుంచి ఆ అమ్మాయితో కలిసి వేరే ప్రాంతంలో కాపురం పెట్టాడు. విషయం తెలిసినా  శిల్పా ఏమీ చేయలేక.. అత్తామామ దగ్గర ఉండేది. నాగార్జున తన ప్రియురాలిని అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి శిల్పాను మానసికంగా వేధించేవారు. ఇటీవల కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక తన భర్త ప్రవర్తనలో మార్పు రాదని భావించిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తానొక్కతే చనిపోతే బిడ్డ అనాథ అవుతుందని భయపడింది. శనివారం అత్తమామలతో కలిసి పొలానికి వెళ్లింది. అందరూ పొలం పనులలో నిమగ్నమై ఉండగా.. శిల్పా బిడ్డతో సహా సమీపంలోని నీటికుంటలో దూకింది. పొలంలో పనిచేస్తున్న వారు గమనించి బయటకు తీసేలోపు ఇద్దరూ ప్రాణాలు విడిచారు. మృతదేహాలకు  ఆలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా