ఏం కష్టం వచ్చింది బిడ్డా!  

7 Nov, 2020 01:57 IST|Sakshi

రెండున్నరేళ్ల కుమార్తెకు ఉరి వేసి తల్లి బలవన్మరణం 

భర్త వేధింపులే కారణమా?

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో విషాదం  

భూపాలపల్లి: ‘బిడ్డా.. మనకేం కష్టమొచ్చింది. బతకడం కన్నా.. చావడమే శరణ్యం’అని ఓ మహిళ బిడ్డతో సహా తనువు చాలించింది. రెండున్నరేళ్ల కుమార్తెకు ఉరి బిగించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. డీఎస్పీ ఎ.సంపత్‌రావు, సీఐ ఎస్‌.వాసుదేవరావు కథనం ప్రకారం.. భూపాలపల్లిలోని జవహర్‌నగర్‌ కాలనీలో నివాసం ఉండే కుమారస్వామికి జగిత్యాల జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌కు చెందిన లాస్య (25)తో 2015లో వివాహం జరిగింది. కేటీకే 1వ గనిలో కుమారస్వామి జనరల్‌ మజ్దూర్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అతను విధులకు వెళ్లగా భార్య లాస్య మధ్యాహ్నం తన కూతురు మహితతో కలసి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చిన కుమారస్వామి తలుపుకొట్టినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా భార్య, కుమార్తె ఉరి వేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను కిందికి దింపారు. మృతురాలి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త వేధింపుల కారణంగానే లాస్య, తన కూతురికి ఉరి వేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కాలనీవాసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు