ఏం ఫ్యామిలీరా బాబూ! పెళ్లి పెటాకులు.. బిడ్డను అమ్మి, వచ్చిన సొమ్ము పంచుకోవాలని..

14 Oct, 2022 16:42 IST|Sakshi
బైక్‌పై ప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న కానిస్టేబుల్‌. వెనుక రారాజు

వచ్చిన డబ్బులు పంచుకోవాలని నిర్ణయం  

పోలీసుల అదుపులో ముగ్గురు

ద్వారకాతిరుమల: వాళ్లిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పదిహేను నెలల్లోనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోవాలనుకున్నారు.ఇందుకు అడ్డుగా ఉన్న తమ నాలుగు నెలల వయసు గల మగబిడ్డను అమ్మేసి, వచ్చిన సొమ్మును పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బిడ్డ తల్లిదండ్రులు, తాత పోలీసులకు చిక్కారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి కొండపై గురువారం జరిగింది. కాకినాడకు చెందిన కేశినేని వసంత (20)కు తల్లిదండ్రులు లేరు.

ఆమె రాజమండ్రిలో బైక్‌ షోరూంలో పనిచేస్తోంది. ఆమెకు రాజమండ్రిలోనే ఒక ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పి.రారాజు(25)తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు. ఇటీవల భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమకు అడ్డుగా ఉన్న బిడ్డను అమ్మేసి, వచ్చిన డబ్బును పంచుకోవాలని భావించారు.

ఈ మేరకు కుమారుడిని తీసుకుని రారాజు, వసంత, రారాజు తండ్రి ప్రసాద్‌ 25 రోజుల కిందట ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఒక వ్యక్తి ద్వారా భీమవరానికి చెందిన వృద్ధుడికి బాబును అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో పిల్లాడి కోసం కొండపైన శ్రీనివాసా నిలయం కాటేజీ ప్రాంతానికి చేరుకున్న వృద్ధుడిని రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రసాద్‌ డిమాండ్‌ చేశాడు.

తాను డబ్బులు ఇవ్వబోనని, బాబును జాగ్రత్తగా పెంచుతానని ఆ వృద్ధుడు చెప్పుకొచ్చాడు. దానికి ప్రసాద్‌ ససేమిరా అనడంతో... కనీసం రూ.2లక్షలు ఇస్తే బాబును ఇస్తామని రారాజు చెప్పాడు. దీంతో రారాజు, అతని తండ్రికి మధ్య గొడవ జరిగింది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న చుట్టుపక్కల భక్తులు అక్కడికి చేరుకుని వారిని నిలదీశారు. దీంతో బాలుడి కోసం వచ్చిన వృద్ధుడు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బిడ్డతోపాటు రారాజు, వసంత, ప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.   

మరిన్ని వార్తలు