తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..?

9 Sep, 2022 07:13 IST|Sakshi
పోలిరెడ్డి (ఫైల్‌)-సంఘటన స్థలంలో డాగ్‌ స్క్వాడ్‌

పెదగంట్యాడ (విశాఖపట్నం): మండలంలోని మదీనాబాగ్‌లో తల్లీకుమారుడు దారుణహత్యకు గురయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 77వ వార్డు పరిధి మదీనాబాగ్‌ ప్రాంతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో మంగి గౌరమ్మ (55), ఆమె కుమారుడు మంగి పోలిరెడ్డి (35) నివసిస్తున్నారు. వీరిద్దరూ మదీనాబాగ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.
చదవండి: ట్రూ లవ్‌ నెవర్‌ ఎండ్స్‌.. నేనూ నీ దగ్గరకే వస్తున్నా..

గౌరమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు నగరంలో ఉంటున్నాడు. రెండో కుమారుడు పోలిరెడ్డి తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇతనికి వివాహం కాలేదు. మూడో కుమారుడు అదే బ్లాక్‌లో ఓ ఇంట్లో భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. కుమార్తెకు వివాహం కావడంతో ఆమె దుబాయ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ బ్లాక్‌ నంబర్‌ 3లో ఎండీ 3ఎస్‌ – 1లోని బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.

వారిద్దరూ ఇందులోనే నివసిస్తున్నారు. అయితే వారి మృతదేహాలు మాత్రం అదే బ్లాక్‌లో ఎదురుగా ఉన్న ఎండీ 4 – 1ఎస్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. అదే బ్లాక్‌లో నివసిస్తున్న గౌరమ్మ మనవడు (చిన్న కుమారుడు కొడుకు) గురువారం మధ్యాహ్నం మృతదేహాలను చూసి డయల్‌ 100కి సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల అదుపులో ముగ్గురు..! 
తల్లీకుమారుడిని ఎవరు హత్య చేశారనే విషయంలో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు. హత్యల సమాచారం తెలిసిన వెంటనే నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌తోపాటు డీసీపీ సుమిత్‌ సునీల్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డాగ్‌ స్క్యాడ్, క్లూస్‌ టీం సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు.

వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మృతురాలి చిన్న కుమారుడితోపాటు, అతని భార్యను పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. వీరితోపాటు సాయి అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాంతంలో కొంత మంది యువకులు గంజాయి సేవిస్తూ అల్లరిచిల్లరగా తిరుగుతుంటారని.. ఈ హత్యలతో వారికేమైనా సంబంధం ఉందా..? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.   

మరిన్ని వార్తలు