మూడు పెళ్లిళ్లు.. సవతుల మధ్య పోరు.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌

15 Jul, 2022 07:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(తమిళనాడు): కృష్ణగిరి జిల్లాలో సవతుల మధ్య జరిగిన పోరులో ఓ తల్లీ, కుమారుడు సజీవదహనం అయిన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఊతంకరై సమీపంలో ఉన్న కల్లావి చెంగల్‌ పట్టికి చెందిన సెందామరై కన్నన్‌ (55) వీధి నాటకం కళాకారుడు. ఇతను ధర్మపురి జిల్లా స్వామియార్‌ పురానికి చెందిన సెల్విని మొదట వివాహం చేసుకున్నాడు.
చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. పెళ్లికి ఒప్పుకోలేదని..

వీరికి ఇద్దరు కుమార్తెలు. ఆ తరువాత సెందామరై కన్నన్‌ కీల్‌కుప్పం ప్రాంతానికి చెందిన కమల (47)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అందులో కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు గురు (17) ప్లస్‌ టూ చదివి ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను సత్య (30) అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ముత్తు అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో రెండో భార్య కమల, మూడో భార్య సత్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల, గురు బుధవారం రాత్రి ఇంటిలో భోజనం చేసి నిద్రపోయారు. గురువారం వారు ఎంతకీ ఇంటిలో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి చూశారు. అనంతరం కల్లావి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, అక్కడ కాలిపోయిన స్థితిలో కమల, గురు మృతదేహాలు ఉన్నాయి. విచారణలో ఇద్దరూ సజీవ దహనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న ఊతంకరై డీఎస్పీ అలెగ్జాండర్‌ విచారణ చేపట్టి, ఇద్దరి మృతదేహాలను శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సవతుల గొడవలో ఇద్దరు సజీవదహనం కావడంపై సెందామరై కన్నన్, సత్యను పోలీసులు విచారణ చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు