గుంటూరులో విషాదం..

30 Oct, 2020 09:28 IST|Sakshi
ఇంటి లోపల అచేతనంగా పడివున్న చాంద్‌బీ, ఎస్థాని

గుంటూరు ఈస్ట్‌: భర్త మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన భార్య మతిస్థిమితంలేని కుమారుడితో పురుగుమందు తాగించి, తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాతగుంటూరు స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. ఎస్‌హెచ్‌ఓ సురేష్‌బాబు కథనం మేరకు.. తమ్మా రంగారెడ్డి నగర్‌ నాలుగో లైనులో నివసించే సయ్యద్‌ అహ్మద్‌ పూల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కరీముల్లా వివాహం చేసుకుని తల్లిదండ్రుల ఇంటి సమీపంలోనే వేరుగా నివసిస్తున్నాడు. రెండో కుమారుడు సుభానీ, మూడో కుమారుడు ఎస్థాని మానసికంగా ఎదగని కారణంగా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. మూడు నెలల క్రితం సయ్యద్‌ అహ్మద్‌ గుండె జబ్బుతో మృతి చెందాడు. భర్త మృతిని జీరి్ణంచుకోలేక భార్య చాంద్‌బీ మానసికంగా కుంగిపోయింది.

‘మీ నాన్న నన్ను పిలుస్తున్నాడు.. మీ నాన్న వద్దకు వెళ్తున్నా’ అంటూ కుమారులతో దిగులుగా చెప్పేది. దీంతో కరీముల్లా తల్లిని, ఇద్దరు తమ్ముళ్లను తన ఇంటికి తీసుకెళ్లి వారి పోషణ చూస్తున్నాడు. చాంద్‌బీ మూడో కుమారుడు ఎస్థానీని తీసుకుని బుధవారం తన ఇంటికి వెళ్లిపోయింది. కరీముల్లా, సుభానీ తాము పూలు విక్రయించే దుకాణానికి వెళ్లిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో సుభానీ  తల్లి నివసించే ఇంటికి వెళ్లగా ఆమె తలుపులు తీయలేదు. దీంతో పెద్దన్న కరీముల్లా వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. కరీముల్లా తల్లి నివసిస్తున్న ఇంటికి వెళ్లగా తలుపు లోపల గడియపెట్టి ఉంది. పక్కన బలహీనంగా ఉన్న మరో తలుపును తెరచి లోపలకు వెళ్లి చూడగా చాంద్‌బీ, ఎస్థాని నురగలు కక్కుతూ అచేతనంగా నేలపై పడి ఉన్నారు. ఇద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు