Khammam: వానజల్లు పడుతోందని బట్టలను తీసుకొచ్చి దండెంపై వేస్తుండగా..

30 Oct, 2021 14:26 IST|Sakshi

బట్టల దండెమే మృత్యుపాశం

బిల్లుపాడులో తల్లీకొడుకు మృతి 

సాక్షి, తల్లాడ: వానజల్లు పడుతోందని బయట ఉన్న బట్టలను తీసుకొచ్చి ఇంట్లో దండెంపై వేస్తుండగా.. ఇనుప తీగకు కరెంట్‌ ప్రసారమై..తల్లి, ఆమెను రక్షించే ప్రయత్నంలో కుమారుడు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన బిల్లుపాడులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..డీబీ కాలనీకీ చెందిన షేక్‌ నసీమూన్‌(44) వ్యవసాయ కూలీ. శుక్రవారం పనికి వెళ్లి ఇంటికొచ్చాక వాన జల్లు పడుతోందని బయట ఉన్న బట్టలను తీసి ఇంట్లోని జీ వైరు తీగపై వేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సర్వీసు వైరు పక్కనే ఉండడంతో దీని నుంచి దండేనికి కరెంట్‌ ప్రసారమై షాక్‌కు గురైంది.
చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి

ఈక్రమంలో కిందపడినప్పుడు మట్టికుండకు తగిలి అది పగిలి నీళ్లు నేలపై పరుచుకున్నాయి. తల్లి కేక విని పెద్ద కుమారుడు, సుతారి పనిచేసే షేక్‌ సైదా(24) వచ్చి ఆమెను రక్షించేందుకు పట్టుకోగా..అతడికీ కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 15 సంవత్సరాల క్రితమే నసీమూన్‌ భర్త యాకుబ్, ఇప్పుడు పెద్ద కొడుకు దుర్మరణం చెందారు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న చిన్న కుమారుడు, మరో కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిరుపేద కుటుంబంలో తీవ్ర దుర్ఘటనతో బిల్లుపాడులో విషాదం అలుముకుంది. సంఘటనా స్థలాన్ని వైరా సీఐ జే.వసంత్‌కుమార్, తల్లాడ ఎస్‌ఐ జి.నరేష్‌ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..

>
మరిన్ని వార్తలు