విజయవాడలో ఘోరం: భార్యా బిడ్డల దారుణ హత్య

30 Apr, 2021 11:10 IST|Sakshi
బుగత మోహన్, నీలవేణి, పిల్లలు (ఫైల్‌ ఫొటో)

ఇద్దరు పిల్లల్ని చున్నీతో ఉరివేసి, భార్యను మెడపై పొడిచి చంపిన భర్త 

పోలీసుల అదుపులో నిందితుడు 

పాయకాపురం (విజయవాడ రూరల్‌): విజయవాడ వాంబే కాలనీలో దారుణం చోటుచేసుకుంది. భర్తే భార్యను, కన్నబిడ్డలను కడతేర్చిన ఘటన బుధవారం అర్ధరాత్రి నున్న పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వాంబే కాలనీ, డి–బ్లాకు, 376 ఫ్లాటులో బుగత మోహన్, నీలవేణి (26) దంపతులు, వారి పిల్లలు రేవంత్‌ (7), ఝాన్సీ› (5) నివసిస్తున్నారు. గురువారం ఉదయం మోహన్‌ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడం, ఏసీ ఆడుతుండటం, డోర్‌ లాక్‌లో ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి తలుపు పగలగొట్టి చూడగా.. మోహన్‌ భార్య నీలవేణి రక్తపు మడుగులో చనిపోయి ఉంది. ఇద్దరు పిల్లలు రేవంత్, ఝాన్సీ›లు మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు.

స్థానికులు వెంటనే పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. మోహన్‌ గతంలో డెంటల్‌ ఆసుపత్రిలో పనిచేసేవాడు. ఆ పని మానేసి, గత కొన్ని నెలలుగా పాత ఇనుము వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. నున్న ఎస్‌ఐ జి.రాజు, నార్త్‌జోన్‌ ఏసీపీ షాను ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తానే చంపానని అంగీకరించిన నిందితుడు 
అప్పుల భారం పెరిగిపోవడంతో కుటుంబంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు, ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి మొదట పిల్లలు ఇద్దర్ని చున్నీతో ఉరివేసి చంపి, అనంతరం భార్య మెడపై పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు మోహన్‌ పోలీసుల విచారణలో పేర్కొన్నాడని సమాచారం. అనంతరం తాను కూడా స్థానిక రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించగా గాయాలయ్యాయని, తన తమ్ముడు వచ్చి తనను ఆస్పత్రిలో చేర్పించాడని నిందితుడు చెబుతున్నాడు. ఆస్పత్రిలో ఉన్న మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

చదవండి: కూతురి ప్రేమ: యువకుడి కాళ్లు, చేతులు నరికి హత్య
విషాదం: పెళ్లయిన మూడు నెలలకే..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు