నా బిడ్డ నాకు కావాలి...

31 Oct, 2020 09:55 IST|Sakshi

పోషించలేక బిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు

బిడ్డను ఇప్పించాలని  పోలీస్‌స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌ : అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను పోషించలేక ఓ తల్లి పొత్తిళ్లలోనే పసికందును విక్రయించింది. అయితే తన బిడ్డ తనకు కావాలని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాచారం సీఐ కిరణ్‌ కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పఠాన్‌చెరువు ప్రాంతానికి చెందిన మీనా, వెంకటేష్‌ దంపతులు నగరానికి వలసవచ్చి నాచారం అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మీనా ఇళ్లల్లో పాచి పని చేసేది. ఆమెకు మొదట ఆడపిల్ల పుట్టి పురిట్లోనే చనిపోయింది. ఆ తర్వాత ఆమె మరో కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రసుత్తం ఆ పాప వయస్సు 2.5 ఏళ్లు. మూడోసారి గర్భం దాల్చిన మీనా తనకు మళ్లీ ఆడపిల్ల పుడితే ఎవరికైనా అమ్మేస్తానని నాచారం ప్రాంతానికి చెందిన మధ్యవర్తి జీహెచ్‌ఎంసీ స్వీపర్‌ జానకికి చెప్పింది.

ఈ క్రమంలో గత జూలై 19న మీనా నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే జానకి మీనాకు ఆడ పిల్ల పుట్టిందని అబద్దం చెప్పింది. అంతేగాక సదరు పసికందును హెచ్‌బీ కాలనీ కృష్ణానగర్‌కు చెందిన రాజేశ్వర్‌రావు, నగినా దంపతులకు రూ.లక్షకు ఇప్పించింది. అందుకు సంబందించి ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నారు. దీంతో రాజేశ్వర్‌రావు, నగినా బిడ్డను తీసుకుని వెళ్లిపోయారు.  కాగా మళ్లీ డబ్బులు కావాలని మీనా వెంకటేష్‌ రాజేశ్వర్‌రావు దంపతులను ఒత్తిడి చేయడంతో వారు ససేమిరా అన్నారు. దీంతో వివాదం పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

గురువారం రాత్రి మీనా తన కుమారుడిని తనకు ఇప్పించాలని కోరుతూ నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు ఆడ పిల్ల పుట్టిందని చెప్పి మోసం చేశారని నా కొడుకును ఇప్పించాలని వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిడ్డ్డను స్వాధీనం చేసుకుని శిశు విహార్‌కు తరలించారు. ఈ ఘటనలో ఈఎస్‌ఐ ఆస్పత్రి సిబ్బంది పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శిశువును అమ్మిన, కొనుక్కున్న వారివురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు