ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ..ఆపై

20 Aug, 2021 21:09 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం (గాజువాక): కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం యారాడలో సంచలనం రేపింది. బంధువులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొల్లి శ్రీను కుటుంబంతో యారాడలో నివాసం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య మొల్లి సంధ్య కూడా కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. శ్రీను ఐదు నెలలుగా పనులకు వెళ్లడం లేదు. భార్య సంపాదనపైనే ఆధారపడుతున్నాడు.

ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన శ్రీను తన 14 ఏళ్ల కుమార్తె అనూష, పదేళ్ల కుమారుడు చరణ్‌లకు బాదం పాలల్లో పురుగు మందు ఇచ్చి తాను కూడా తాగాడు. దీంతో వారందరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. బంధువులు గమనించి వెంటనే వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన తెలిసిన వెంటనే న్యూపోర్టు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పిల్లల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. వారి స్టేట్‌మెంట్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు