నలుగురి ప్రాణాలు తీసిన క్షణికావేశం

1 Jul, 2021 03:35 IST|Sakshi
పిల్లలతో భోగీశ్వరి(ఫైల్‌)

ముగ్గురు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా జగన్నాథవలసలో విషాదం

అత్త, మామల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఫిర్యాదు

జి.సిగడాం: కుటుంబ కలహాలు నలుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. తల్లి క్షణికావేశం వల్ల ముగ్గురు పిల్లలు అర్ధాంతరంగా తనువు చాలించారు.  శ్రీకాకుళం జిల్లా జగన్నాథవలసలో ఓ తల్లి పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. జగన్నాథవలసకు చెందిన బుట్టా శంకర్రావు, భోగీశ్వరి(27) దంపతులకు ఇద్దరు కుమారులు చక్రియ(5), భరత్‌(18 నెలలు), ఒక కుమార్తె జయలక్ష్మి(3) ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు భోగీశ్వరి ముగ్గురు పిల్లలను తీసుకొని ఇంటి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. పిల్లలతో సహా అందులో దూకేసింది.

అటుగా వెళ్తున్న పలువురు ఇది గమనించి వెంటనే బావి వద్దకు పరుగులు తీశారు. కానీ బావి 60 అడుగుల లోతు ఉండటంతో వారిని కాపాడలేకపోయారు. అదే సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. నలుగురి మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. విషయం తెలుసుకున్న భోగీశ్వరి తల్లి పార్వతి, భర్త శంకర్రావుతో పాటు బంధువులు ఘటనాస్థలికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. అత్త, మామల వేధింపుల వల్లే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని భోగీశ్వరి తల్లి పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లుడు శంకర్రావుకు, తన కుమార్తెకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు