ఆర్థిక ఇబ్బందులతో..

27 Aug, 2021 01:25 IST|Sakshi
కూతురు గ్లోరితో తల్లి వింధ్య (ఫైల్‌)

కూతురితో కలిసి చెరువులో దూకిన తల్లి

పటాన్‌చెరు టౌన్‌: సమయానికి డబ్బులు చేతికందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తిచెందిన ఓ మహిళ.. ఐదేళ్ల కుమార్తెతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పటాన్‌చెరు పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూర్‌ మండలం దోవుర్‌ గ్రామానికి చెందిన రాజు పటాన్‌చెరు శాంతినగర్‌లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. రాజు సోదరి వింధ్య (30)భర్త ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకోగా, అప్పటినుంచి ఐదేళ్ల కూతురు గ్లోరితో కలసి పటాన్‌చెరులోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటూ ఓ మెడికల్‌ కళాశాలలో నర్సుగా పని చేస్తోంది. బుధవారం వింధ్య, తన భర్తకు సంబంధించిన డబ్బుల విషయంలో నారాయణఖేడ్‌ వెళ్దామని శాంతినగర్‌లో ఉండే సోదరుడు రాజు ఇంటికి వెళ్లింది.

కొద్ది సేపటి తర్వాత డబ్బులు అప్పుడే రావడం లేదని తెలుసుకొని, సోదరుడికి చెప్పి వెళ్లిపోయింది. అలా వెళ్లిన వింధ్య.. కూతురు గ్లోరిని తీసుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని వింధ్య సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు