కట్టు తప్పాడని.. కడతేర్చిన తల్లి..ఇంటి ఆవరణలోనే...!

24 May, 2021 04:38 IST|Sakshi

తాగొచ్చి కొడుతూ.. లైంగికంగా వేధించడంతో కుమారుడి హత్య 

ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన వైనం 

వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన 

కొత్తకోట రూరల్‌: కొడుకు మద్యానికి బానిసై చెడు తిరుగుళ్లు తిరుగుతూ తాగొచ్చి కొట్టి.. లైంగికంగా వేధిస్తుండటంతో భరించలేని తల్లి అతడిని తుదముట్టించింది. హత్య చేశాక ఇంటి ఆవరణలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన హరిజన్‌ నాగమ్మకు 25 ఏళ్ల క్రితం పామాపురం వాసి శాంతన్నతో వివాహమైంది. వీరికి కుమారుడు శివ (25), కూతురు అంజలి ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో నాగమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తల్లి బుచ్చమ్మ వద్ద ఉంటూ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

కూతురు అంజలికి వివాహం చేసి అత్తారింటికి పంపింది. కుమారుడు శివ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, హమాలీగా పనిచేస్తున్నాడు. అయితే శివ ఇటీవల మద్యానికి బానిసై పనికి సరిగా వెళ్లడం లేదు. తరచూ తల్లిని, అమ్మమ్మను దూషించడంతో పాటు కొడుతుండేవాడు. అలాగే తల్లిని లైంగికంగానూ వేధించసాగాడు. దీంతో అతడి ప్రవర్తనకు తట్టుకోలేక ఎలాగైనా అంతమొందించాలని నాగమ్మ, బుచ్చమ్మ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన రాత్రి గాఢ నిద్రలో ఉన్న శివను తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి.. తర్వాత పక్కనే ఉన్న చెట్టుకు కట్టి కత్తితో పొడిచి చంపేశారు.  


బయట పడిందిలా..  
ప్రస్తుతం గ్రామంలో ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతోంది. శివ ఐదు రోజులుగా పనికి రాకపోవడంతో ఈనెల 21వ తేదీన సాయంత్రం తోటి హమాలీలు ఇంటికి వెళ్లి ఏమైందని తల్లి నాగమ్మను అడగ్గా ఆమె తడబడుతూ సమాధానం చెప్పింది. చివరకు 22న సర్పంచ్‌ లతకు అసలు విషయం చెప్పింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్, ఇన్‌చార్జి సీఐ సీతయ్య, ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగమ్మ, బుచ్చమ్మలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సోమవారం ఉదయం డాక్టర్, తహసీల్దార్‌ సమక్షంలో శివ మృతదేహాన్ని వెలికితీస్తామని తెలిపారు. కాగా, ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు