వివాహేతర సంబంధం: బిడ్డల పాలిట శాపం

16 Sep, 2020 08:53 IST|Sakshi

అభం శుభం తెలియని పసివాళ్లు.. లోకం చూడని చిన్నారులు.. అమ్మ ఒడిలో వెచ్చగా సేదతీరాల్సిన కవలలు.. చీకటి దుర్మార్గానికి బలయ్యారు.. తల్లి వివాహేతర సంబంధం బిడ్డల పాలిట శాపమైంది. తమ ప్రేమ కలాపాలకు అడ్డుగా ఉన్నారని ప్రియుడు భావించాడు. మానవత్వాన్ని మట్టిలో కలిపేశాడు.. చిన్న పిల్లలను చెరువులో విసిరేశాడు.. చిరు ప్రాణాలను నిర్ధాక్షిణ్యంగా చిదిమేశాడు.

సాక్షి, సదుం: చింతపర్తివారిపల్లె సమీపంలోని నడిమోడుకుంటలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను మంగళవారం స్థానికులు గుర్తించారు. సమీపంలోనే  స్త్రీపురుషులు అపస్మారకస్థితిలో పడిఉండడం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి  సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ ధరణీధర చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను వెలికితీయించారు. స్పృహలో లేని స్త్రీ, పురుషులను 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వివరాలను సేకరించారు. ఎస్‌ఐ ధరణీధర కథనం మేరకు.. పులిచెర్ల మండలం 102ఈ.రామిరెడ్డిగారిపల్లెకు చెందిన వెంటేశ్వరరెడ్డికి హేమశ్రీతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది.  ఆమెకు అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ ఉదయ్‌కుమార్‌తో కొంతకాలంగా సాన్నిహిత్యం ఏర్పడింది.

హేమశ్రీ తనతో రావాలని లేకుంటే చనిపోతానని ఉదయ్‌కుమార్‌ బెదిరించాడు. దీంతో హేమశ్రీ తన ఇద్దరు కవలపిల్లలు పునర్విరెడ్డి, పునిత్‌రెడ్డి(10 నెలలు)తో కలిసి సోమవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఒంటి గంటకు ప్రియుడితో కలిసి ఆటోలో బయలుదేరింది. చింతపర్తివారిపల్లె వద్ద కుంట వద్దకు రాగానే ఉదయ్‌కుమార్‌ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని చిన్నారులను అందులో విసిరేశాడు. ఇది చూసి ఆందోళన చెందిన హేమశ్రీ తన వద్దనున్న పురుగుల మందు తాగేసింది. దీంతో ఉదయ్‌కుమార్‌ కూడా భయపడి పురుగుల మందు తా గాడు. దీనిపై వేంకటేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్‌కుమార్‌పై హత్యానేరం కింద నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు