ఆన్‌లైన్‌ క్లాసులు: కూతురిని పెన్సిల్‌తో పొడిచి

24 Oct, 2020 11:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: ఆన్‌లైన్‌ క్లాసులపై శ్రద్ధ పెట్టడంలేదంటూ కూతురి పట్ల కర్కశంగా ప్రవర్తించిందో తల్లి. పెన్సిల్‌తో పొడిచి గాయపరిచింది. ఈ ఘటన ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లన్నీ ఆన్‌లైన్‌ బోధనకే మొగ్గుచూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన పన్నెండేళ్ల బాలిక రోజూ మాదిరిగానే బుధవారం కూడా ఆన్‌లైన్ క్లాస్‌కు హాజరైంది. ఆరో తరగతి చదువుతున్న ఆమె, టీచర్‌ అడిగిన ప్రశ్నలకు జవాబివ్వకుండా అలాగే చూస్తుండిపోయింది. (చదవండి: కత్తి సరిపోలేదని ఖడ్గంతో కోశాడు.. )

ఇక ఆ సమయంలో, పక్కనే ఉన్న బాలిక తల్లికి కూతురి తీరు ఆగ్రహం తెప్పించింది. టీచర్‌కు ఎందుకు బదులివ్వడం లేదంటూ పెన్సిల్‌తో 12 సార్లు ఆమె వీపుపై పొడిచింది. ఆ తర్వాత కొరికి గాయపరిచింది. తల్లి ప్రవర్తనను గమనిస్తున్న ఆమె చిన్నకూతురు వెంటనే చైల్డ్‌ హెల్‌‍్పలైన్‌ నంబరుకు ఫోన్‌చేసి విషయం చెప్పింది. ఈక్రమంలో ఎన్జీవో ప్రతినిధులు కొంతమంది బాధితురాలి ఇంటికి చేరుకుని, ఆమె తల్లిని నిలదీయగా, తను ఇలాగే ఉంటానని, తనను ప్రశ్నించే హక్కులేదంటూ వారిపై ధ్వజమెత్తింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు