కన్నతల్లి కర్కశత్వం: బతికుండగానే బావిలోకి తోసేసింది

23 Jun, 2021 01:24 IST|Sakshi

14 ఏళ్ల కుమారుడికి తల్లి మరణ శాసనం...

అతడి మానసిక స్థితితో విసిగిపోయినట్లు వెల్లడి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘటన

పెద్దపల్లి: దివ్యాంగుడైన కుమారుడికి పద్నాలుగేళ్లు సపర్యలు చేసింది. వయసు, శరీరం పెరుగుతున్నా అతడి మానసిక స్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఇటీవల కొంతకాలంగా విపరీత ప్రవర్తన మరింత పెరిగిపోవడంతో విసిగిపోయింది. కొడుకు బతికుండగానే బావిలోకి తోసి చంపేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రదీప్‌కుమార్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని మొఘల్‌పురకు చెందిన శేఖర్, శ్యామల దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు యశ్వంత్‌ (14) పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. శేఖర్‌ మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఉద్యోగి. శ్యామల ఇంట్లోనే ఉంటూ యశ్వంత్‌ బాగోగులు చూసుకుంటోంది. యశ్వంత్‌ వయసు, శరీరం పెరుగుతున్నా మానసిక స్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. అతని ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో అనేక ఆస్పత్రులు తిరిగారు. ప్రస్తుతం నెలకు రూ.7 వేల విలువైన మందులు వాడుతున్నారు. మందులు వాడినప్పుడు మాత్రమే యశ్వంత్‌ బాగుంటున్నాడు. మందులు లేకపోతే అతని ప్రవర్తనలో మార్పు వస్తోంది. శేఖర్‌కు తగిన స్థోమత లేకపోవడంతో డబ్బులు ఉన్నపుడే మందులు తెచ్చి వాడేవారు. మందులు వేయని సమయంలో యశ్వంత్‌కు మల, మూత్ర విసర్జన కూడా తెలియడం లేదు. పైగా విపరీత ప్రవర్తన పెరిగిపోవడంతో శ్యామల కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతోంది.

ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి.. 
యశ్వంత్‌ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, విపరీత మానసిక ప్రవర్తనతో కాలనీవాసులు కూడా ఇబ్బందిపడుతున్నారని శ్యామల సోమవారం భర్తకు చెప్పింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పి శేఖర్‌ ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు. యశ్వంత్‌ను తీసుకుని బయల్దేరిన శ్యామల, పట్టణ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అందులోకి తోసేసింది. దీంతో నీటిలో మునిగిపోయిన యశ్వంత్‌ మృతి చెందాడు. సాయంత్రం ఒంటరిగా ఇంటికొచ్చిన శ్యామలను.. భర్త, కుటుంబసభ్యులు యశ్వంత్‌ గురించి ఆరా తీయగా బావిలోకి తోసి చంపేశానని తెలిపింది. దీంతో వారు బావి వద్దకు వెళ్లి చూసి అప్పటికే చీకటి పడడంతో మిన్నకుండిపోయారు. మంగళవారం ఉదయం యశ్వంత్‌ మృతదేహం బావిలో తేలడంతో శేఖర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

బావిలో తోసేశానని చెప్పింది 
స్థానికుల సహాయంతో పోలీసులు యశ్వంత్‌ మృతదేహాన్ని బయటకు తీయించారు. శేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్యామలను అదుపులోకి తీసుకున్నారు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయి తానే బావిలో తోసేశానని శ్యామల అంగీకరించిందని సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.   

మరిన్ని వార్తలు