ఘోరం: డబ్బుల కోసం డెలివరీ బాయ్‌ను పొడిచారు.. రక్తస్రావంతోనే బైక్‌పై ఆస్పత్రికి..

30 Jul, 2022 10:59 IST|Sakshi

భోపాల్‌: పొట్టకూటి కోసం డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న కుర్రాడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు దుండగులు. చావు బతుకుల మధ్య ఆస్పత్రికి వెళ్లిన ఆ యువకుడికి అక్కడా నిర్లక్ష్యమే ఎదురైంది. చికిత్స ఆలస్యం కావడంతో  ఒక నిండు ప్రాణం బలైంది. 

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ బాన్‌గంగా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. సునీల్‌ వర్మ అనే 20 ఏళ్ల యువకుడు డిగ్రీ చదువుతూనే.. జొమాటో ఫుడ్‌ డెలివరీ యాప్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి తన మోటార్‌బైక్‌పై అరబిందో సమీపంలోని కరోల్‌బాగ్ వద్ద ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా.. ముగ్గురు అతన్ని బైకులపై వెంబడించారు. అతన్ని అడ్డగించి కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో స్వయంగా బండి నడుపుతూనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నాడు.

అయితే ఆస్పత్రిలోనూ అతనికి సకాలంలో చికిత్స అందలేదు. ఆలస్యంగా చికిత్స ప్రారంభించిన వైద్యులు.. పరిస్థితి విషమించే సరికి మరో ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి అతను కన్నుమూశాడు. 

సీసీ ఫుటేజీ ఆధారంగా అతన్ని ముగ్గురు వెంబడించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. శరీరంలో ఐదు కత్తిపోట్లు ఉన్నాయని, దొంగతనంలో భాగంగా పెనుగులాటలో అతని బ్యాగ్‌ చినిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనపై పలు కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టినట్లు, నిందితులను పట్టుకుంటామని ఇండోర్‌ పోలీసులు వెల్లడించారు. మరోవైపు టైంకి చికిత్స అందించని ఆస్పత్రి వర్గాలపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు