ఎంపీ కేకేను బురిడీ కొట్టించే ప్రయత్నం

26 Aug, 2020 09:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వ పథకమంటూ, కేటీఆర్‌ సిఫారసు చేశాడని చెబుతూ ఏకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావును బురిడీ కొట్టించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఎంపీ కేకేకు ఫోన్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తి తన పేరు మహేష్‌ అని, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. కేంద్రం నుంచి ఎంపీలకు ప్రైమ్‌ మినిష్టర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ స్కీం కింద  20 మంది వ్యాపారులకు రూ.25 లక్షల మేర రుణాలు ఇప్పించుకునే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో కేకే తన కుమార్తె కార్పొరేటర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో మాట్లాడాల్సిందిగా సూచించాడు.

ఆమె తన డివిజన్‌ పరిధిలో ఉన్న కొందరు కార్యకర్తలకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో మహేష్‌తో మాట్లాడేందుకు అంగీకరించింది. మహేష్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ గారు మీ పేరు సూచించారని ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్‌ విజయారెడ్డి కూడా ఈ రుణాల కోసం పోటీ పడుతున్నారని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తే ఆశాభంగమని చెప్పాడు. ఈ రుణం తీసుకున్న వారికి 50 శాతం సబ్సిడీ కూడా ఉంటుందని ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజే చివరి అవకాశమని దీని కోసం ప్రాసెసింగ్‌ ఫీజుగా ప్రతి ఒక్కరు రూ. 1.25 లక్షలు  కట్టాల్సి ఉంటుందని చెప్పాడు.

మంత్రి కేటీఆర్‌ సూచించడంతోనే తాను ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మబలికాడు. సదరు రుణాలతో  సూపర్‌ మార్కెట్, పౌల్టీ ఫామ్, జనరల్‌ స్టోర్, ఫోర్‌ వీల్‌ ట్రావెల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. సాయంత్రం 4 గంటల్లోపు డబ్బులను తన పేరున ఉన్న అకౌంట్‌లో జమ చేయాలని చెప్పాడు. దీంతో అప్పటికప్పు డు కొందరు లబ్ధిదారులను పిలిపించి విషయాన్ని వివరించింది. మంచి అవకాశం ఉందంటూ కార్పొరేటర్‌ చెప్పడంతో ఆగమేఘాల మీద డబ్బులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. 

ఆఖరి నిమిషంలో అనుమానం...  
అయితే ఆఖరి నిమిషంలో ఈ పథకంపై కేకేకు అనుమానం వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావించిన ఆయన మరోసారి మహేష్‌కు ఫోన్‌ చేసి  ఎక్కడున్నారని ఆరా తీయగా తాను ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో ఉన్నానని డీడీల మీద సంతకాలు చేయించేందుకు వచ్చినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని నేరుగా కేటీఆర్‌తో కనుక్కుందామని మంత్రికి ఫోన్‌ చేశాడు. అయితే కేటీఆర్‌ స్పందించకపోవడంతో ఆయన పీఏకు ఫోన్‌ చేయగా కేటీఆర్‌ అసలు హైదరాబాద్‌లోనే లేరని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు చెప్పడంతో కేకే అవాక్కయ్యారు. దీంతో తన కుమార్తెకు  విషయం చెప్పడంతో ఇదేదో అనుమానంగా ఉందని చెప్పడంతో వారంతా ఫోన్‌ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా కేవలం ఆధార్‌ కార్డు మాత్రమే పంపాలని మహేష్‌ సూచించడంతో దానిపై లోన్‌ ఎలా ఇస్తారంటూ అనుమానం వ్యక్తం చేశారు.  

అత్యుత్సాహంతో 50 వేలు హాంఫట్‌...  
ఓ వైపు  స్కీం విషయమై విజయలక్ష్మి చర్చిస్తుండగానే సదరు వ్యక్తి విజయలక్ష్మి దగ్గర ఉండే యువకుడు మేక అఖిల్‌కు ఫోన్‌ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తనుకు ఆర్టీజీఎస్‌ ద్వారా  ఎవరు ముందుగా డబ్బులు వేస్తే వారికే రుణం వస్తుందని తొందరపెట్టాడు. దీంతో అఖిల్‌ తన అకౌంట్‌ ద్వారా రూ. 50 వేలు మహేష్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. మరో రూ. 50 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసేలోగా మోసాన్ని పసిగట్టిన విజయలక్ష్మి ఈ విషయాన్ని అఖిల్‌కు చెప్పగా మిగతా డబ్బులు వేయలేదు. ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులకు అఖిల్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. ఈ లోగా అతడు వేసిన రూ. 50 వేలలో రూ.40 వేలు నిందితులు అప్పటికే డ్రా చేశారు. మిగతా రూ.10 వేలు డ్రా చేసేందుకు నిందితులు ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాంకు అధికారులు మహేష్‌ బ్యాంకు అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేశారు.  

నిజామాబాద్‌లో విత్‌ డ్రా 
అఖిల్‌ డిపాజిట్‌ చేసిన నగదులో రూ. 40 వేలను సంజీవ్‌ అనే వ్యక్తి నిజామాబాద్‌లో డ్రా చేసినట్లు తెలిసింది. మరో 10 వేలు డ్రా చేసేలోగానే బ్యాంకు అధికారులు అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేయడంతో సంజీవ్‌ అనే వ్యక్తి బ్యాంకు అధికారులతో అక్కడ గొడవకు దిగినట్లు సమాచారం. కార్పొరేటర్‌ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం, బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు