యువకుడి రెండు చేతులను నరికేసిన సర్పంచ్‌ భర్త..

18 Jul, 2021 15:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచోసుకుంది. పంట సేకరణ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఒక వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చిన అమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన హోషంగాబాద్‌ జిల్లాలో జరిగింది. చౌరాహెట్‌ గ్రామాంలో కొన్ని రోజులుగా పంట సేకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో.. సదరు గ్రామానికి చెందిన సోమేష్‌ గుర్జార్‌ అనే రైతు ఒక రోజు సర్పంచ్‌ భర్త అయిన భగవాన్‌ సింగ్‌కు తమ సమస్యలను పరిష్కరించాలని కోరాడు.

ఈ విషయం గురించి గ్రామస్తులు పలుమార్లు సర్పంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఒకరోజు సోమేష్‌ గుర్జార్‌ గ్రామస్థుల అందరి సమక్షంలో సర్పంచ్‌ భర్తను నిలదీశాడు. దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటమాట పెరిగి ఒకరి కాలర్‌ను మరోకరు పట్టుకున్నారు. ఈ సంఘటనను భగవాన్‌ సింగ్‌ అవమానకరంగా భావించి ఆవేశంతో​ రగిలిపోయాడు. గుర్జార్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో గత శుక్రవారం రాత్రి సింగ్‌ కుటుంబం సభ్యులు గుర్జార్‌ను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మూకుమ్మడిగా కర్రలతో దాడిచేశారు. దీంతో గుర్జార్‌ లేవలేని స్థితిలో కిందపడిపోయాడు.

అప్పుడు భగవాన్‌ సింగ్‌ ఒక కోడవలితో రైతు రెండు చేతులను విచక్షణ రహితంగా నరికేశాడు. ఈ క్రమంలో, రైతు రెండు చేతులు తెగిపోయి, రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనతో అతని కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గుర్జార్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సర్పంచ్‌ భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు