పులి చర్మం అమ్మేందుకు వచ్చి..

22 Dec, 2021 04:28 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న పులి చర్మాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సంగ్రాం సింగ్‌ పాటిల్, డీఎఫ్‌ఓ ప్రదీప్‌కుమార్‌ 

చత్తీస్‌గఢ్‌ నుంచి తెచ్చి రాష్ట్రంలో అమ్మడానికి యత్నం.. పట్టుకున్న పోలీసులు

ములుగు: ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రంలో అమ్మేందుకు తీసుకొస్తున్న పులి చర్మాన్ని ములుగు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్‌ నుంచి కొందరు వ్యక్తులు పులి చర్మంతో రాష్ట్రానికి వస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అటవీ సిబ్బందితో కలసి జగన్నాథపురం వై జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

వారి వద్ద ఉన్న సంచిని విప్పి చూడగా అందులో పులి చర్మం కనిపించింది. దీంతో వారు దూలాపురం ఎఫ్‌ఆర్వోకు సమాచారం అందించగా..పరిశీలించిన ఆయన దాన్ని పులి చర్మంగా నిర్ధారించారు. వెంకటాపురం(కె) మండలం కొండాపురం గ్రామానికి చెందిన పూనెం విగ్నేష్, సోది చంటి, సోయం రమేశ్, ఏటూర్‌నాగారం మండలం గోగుపల్లికి చెందిన చీరా శ్రీను, టేకులపల్లికి చెందిన చింతల బాలకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. పులి చర్మం, 3 సెల్‌ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు