జ్యుడీషియల్‌ కస్టడీకి ఆర్యన్‌

8 Oct, 2021 06:07 IST|Sakshi

మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

ముంబై: క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్‌ స్వాధీనం కేసులో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌తోపాటు మరో ఏడుగురిని 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ముంబై మేజిస్ట్రేట్‌ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అతని న్యాయవాది సతీష్‌  దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది. నిందితులను తమ కస్టడీకి అప్పగిస్తూ ఇచ్చిన గడువును ఈ నెల 11 దాకా పొడిగించాలని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) కోరింది. డ్రగ్స్‌ స్వాధీనం కేసులో కుట్రలను వెలికి తీయాల్సి ఉందని, ఈ వ్యవహారంలో అచ్చిత్‌ కుమార్‌ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశామని(సరఫరాదారు కావొచ్చని అనుమానం).. అతడిని, నిందితులను కలిపి విచారించాల్సి ఉందని వెల్లడించింది. అయితే, ఎన్‌సీబీ విజ్ఞప్తిని న్యాయస్థానం కొట్టిపారేసింది.

అస్పష్టమైన ఆధారాలను బట్టి నిందితులను మళ్లీ ఎన్‌సీబీ కస్టడీకి అప్పగించలేమని పేర్కొంది. ఈ నెల 3న ముంబై నుంచి గోవాకు పయనమైన పర్యాటక నౌకలో డ్రగ్స్‌తో కొందరు పార్టీ చేసుకుంటున్న సమాచారం అందడంతో ఎన్‌సీబీ దాడి చేసింది. వివిధ రకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఆర్యన్‌ ఖాన్, మున్‌మున్‌ ధామేచా, అర్బాజ్‌ మర్చంట్‌ను అరెస్టు చేసింది.  షారుక్‌ మేనేజర్‌ పూజా దద్లానీ గురువారం కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె రోదించారు. 8 మంది నిందితులకు కోవిడ్‌ నెగటివ్‌ టెస్టు రిపోర్టు లేకపోవడంతో అధికారులు వారిని జైలుకు తరలించకుండా గురువారం రాత్రి ఎన్‌సీబీ ఆఫీస్‌లోనే∙ఉంచారు. నిందితులను కలిసి, మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులను అనుమతించారు. పూజా దద్లానీ ఎన్‌సీబీ ఆఫీసుకు వచ్చి ఆర్యన్‌ను కలిశారు.

మరిన్ని వార్తలు