నీకు ఆమెతో ఎఫైర్‌ ఉంది.. 10 లక్షలు ఇవ్వు!

15 May, 2021 19:21 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు

ముంబై : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను ఓ వ్యక్తి తన జీవితానికి అన్వయించుకున్నాడు. అప్పులు తీర్చడానికి, తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి అడ్డుతొలిగించుకోవటానికి ఓ చక్కటి పథకం వేశాడు. ఆ పథకం పారక చివరకు పోలీసులకు చిక్కి, కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ముంబై, భివాండికి చెందిన తుషార్‌ సిల్వంత్‌ వ్యాపారంలో నష్టాలు రావటంతో బాగా కుమిలిపోయాడు. దానికి తోడు భార్య అతడ్ని వదిలేసి వేరుగా ఉంటోంది. మసాజ్‌ పార్లర్‌లో పనిచేస్తున్న ఆమె ఓ కస్టమర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తుషార్‌కు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చడానికి, తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి అడ్డుతొలిగించుకోవటానికి ఓ చక్కటి పథకం వేశాడు.

భార్య ప్రియుడికి ఫోన్‌ చేసి, తననో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుగా పరిచయం చేసుకున్నాడు. ‘‘ మసాజ్‌ పార్లర్‌లో పని చేస్తున్న ఆమెతో నీకు ఎఫైర్‌ ఉంది. చట్టపరంగా నీ మీద చర్యలు తీసుకోకుండా ఉండాలంటే రూ.10లక్షలు పంపు’’ అని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాధితుడు రూ. 5లక్షలు పంపాడు. కొద్దిరోజుల తర్వాత తుషార్‌ మరోసారి బాధితుడికి ఫోన్‌ చేసి మిగిలిన రూ.5లక్షలు డిమాండ్‌ చేశాడు. ఈ సారి తుషార్‌పై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో అతడి భార్యకు సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు