పోలీసుల విచారణకు రిపబ్లిక్‌ టీవీ సీఈఓ, సీఓఓ

12 Oct, 2020 06:24 IST|Sakshi

ముంబై: టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్‌ టీవీ’ సీఈఓ వికాస్‌ ఖాన్‌చందానీ, సీఓఓ హర్‌‡్ష భండారి ఆదివారం ముంబై పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వారిలో సీఈఓ వికాస్‌ను 9 గంటల పాటు, హర్‌‡్షను 5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ఏ విధమైన ఒత్తిడికైనా తలొగ్గబోమని ఈ సందర్బంగా రిపబ్లిక్‌ టీవీ ప్రకటించింది. ‘ఈ రోజు మా సీఈఓ, సీఓఓ, డిస్ట్రిబ్యూషన్‌ టీమ్‌ సీనియర్‌ సభ్యుడిని పోలీసులు సుమారు 20 గంటల పాటు ప్రశ్నించారు.

ఈ స్కామ్‌కు సంబంధించి హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు కాపీని రిపబ్లిక్‌ టీవీ ఎప్పుడు, ఎలా, ఎవరి నుంచి సంపాదించిందనే ప్రశ్ననే వారు అడిగారు’ అని పేర్కొంది. అది ఎడిటోరియల్‌ విషయమని వారికి సీఈఓ జవాబిచ్చారని తెలిపింది. ‘హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదులో తమపై ఎలాంటి ఆరోపణ లేదు. ఇండియా టుడే చానెల్‌ పేరునే ఆ ఫిర్యాదులో హంస ఏజెన్సీ ప్రస్తావించింది. ఫిర్యాదు కాపీ లో ఉన్న విషయాన్ని అక్టోబర్‌ 10 వ తేదీననే రిపబ్లిక్‌ టీవీ బయటపెట్టింది’ అని వివరించింది. 

మరిన్ని వార్తలు