కరోనా విలయం: బ్లాక్‌మార్కెట్‌కు కీలక ఔషధం

9 Apr, 2021 16:28 IST|Sakshi

కొరతను క్యాష్‌ చేసుకుంటున్న అక్రమార్కులు

పలు మందుల దుకాణాలపై దాడులు

బ్లాక్‌మార్కెట్లో రెమ్‌డెసివర్‌,ఇద్దరు అరెస్ట్‌

సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల నమోదులో రోజుకోకొత్త రికార్డుతో మరింత బెంబేలెత్తిస్తోంది. మరోవైపు కరోనా నివారణకు ఉపయోగించే కీలకమైన రెమ్‌డెసివర్‌ మందును బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతోంది.  ఈ నేపథ్యంలో ముంబైలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి అధికారులు దాడులు నిర్వహించారు.  ఈ సందర్భంగా ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్  284 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి  ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.  

కరోనా వైరస్ చికిత్సలో కీలకమైన 12 మోతాదుల రెమ్‌డెసివిర్‌ను అక్రమంగా తరలిస్తూ సర్ఫరాజ్ హుస్సేన్  అంధేరి (తూర్పు) వద్ద పట్టుబడ్డాడని ముంబై పోలీసులు శుక్రవారం తెలిపారు.  ఆ తరువాత  నిర్వహించిన దాడుల్లో 272  ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నా మన్నారు. మహారాష్ట్ర కేసుల తీవ్రతతో, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. నాగ్‌పూర్, నాసిక్, ముంబై, పూణేలో  ఈ ఔషధానికి తీవ్ర కొరత ఏర్పడింది.  ఈ కొరతను  క్యాష్‌ చేసుకుంటున్న , కొంతమంది మందులను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను మహారాష్ట్ర ప్రభుత్వం  రూ1,100 -1400  మధ్య సరఫరా  చేస్తుండగా, బ్లాక్ మార్కెట్లో ఇది 5000-6000 రూపాయలు పలుకుతోంది.  మరోవైపు దేశంలో కరోనా  ఉగ్రరూపం కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ  ప్రకారం అందించిన సమాచారం ప్రకారం దేశంలో గడచిన 24 గంటల్లో 1,31,968 మంది కొత్తగా కోవిడ్ -19 వైరస్ బారిన పడ్డారు. అలాగే వరసగా మూడో రోజూ లక్షా పదిహేనువేలకిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 56,286 మంది వైరస్‌బారిన పడటం  ఆందోళన పుట్టిస్తోంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు