మున్నా నేర చరిత్ర.. కేరాఫ్‌ విజయవాడ

27 May, 2021 04:23 IST|Sakshi

తరువాత గుంటూరుకు, అక్కడ నుంచి ఒంగోలుకు మకాం 

ఒంగోలులో 2008లో హైవే హత్యలు..  

సాక్షి, విజయవాడ: ఒంగోలు జాతీయ రహదారిపై పదమూడేళ్ల క్రితం మారణకాండ సృష్టించిన కేసులో ఉరిశిక్ష పడిన నరహంతక ముఠాలోని ప్రధాన నిందితుడు అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా నేర చరిత్ర విజయవాడలోనే ప్రారంభమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. పదిహేడు సంవత్సరాల కిందట కడప జిల్లా రాజంపేట సమీపంలోని చిట్వేలిలో విస్తరించిన నల్లమల అడవుల్లో గుప్త నిధులున్నాయని నిందితుడు మున్నా కొంతమందిని నమ్మించాడు. వాటిని వెలికి తీస్తామని నమ్మబలికి అనేక మంది వద్ద నుంచి దాదాపు రూ.11 లక్షల వరకు మున్నా గ్యాంగ్‌ వసూలు చేసింది.

మున్నా చేతిలో మోసపోయిన రవికుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్న మున్నా, అతని నలుగురు అనుచరుల్ని సత్యనారాయణపురం పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లోనే మున్నా వద్ద మూడు రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు అనంతరం మున్నా అతని ముఠాతో సహా మకాంను విజయవాడ నుంచి గుంటూరుకు మార్చాడు. అక్కడ నల్లమల అడవుల్లో బంగారం తవ్వకాలు అంటూ కొందర్ని మోసం చేశారు. అనంతరం ఒంగోలుకు మకాం మార్చాడు. ఆ జిల్లాలో పోలీసులమని చెప్పి హైవేపై ఇనుముతో వెళుతున్న భారీ లారీలను ఆపి డ్రైవర్, క్లీనర్‌ను దారుణంగా హత్య చేసేవారు. 2008లో నమోదైన ఆ కేసుల్లో.. ఒంగోలు 8వ అదనపు జిల్లా జడ్జి టి.మనోహర్‌రెడ్డి మున్నాతో పాటు మరో 11 మందికి ఉరిశిక్ష వేసిన సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు