స్నేహితుడితో వివాహేతర సంబంధం.. ఆపై భర్తతో కలిసి..

9 Sep, 2022 07:26 IST|Sakshi
హతుడు సిదార్థ(ఫైల్‌) హత్య చేసిన దంపతులు

యాదగిరి జిల్లాలో దారుణం 

ఆలస్యంగా వెలుగు చూసిన వైనం  

సాక్షి, రాయచూరు రూరల్‌: భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిని హత్య చేసిన ప్రేయసి ఘటన యాదగిరి జిల్లాలో ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. గురుమట్కల్‌ తాలూకా కడేచూరు–బాడియాళ పారిశ్రామికవాడలో సిద్దార్థ(30) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఘటన పూర్వాపరాలు...యాదగిరి తాలూకా యలసత్తికి చెందిన సిద్దార్థ బెంగళూరులో సొంతంగా రెండు కార్లను అద్దెకు తిప్పేవాడు. కడేచూరుకు చెందిన శ్రీదేవి(35) అనే మహిళకు శహపుర తాలూకాకు చెందిన బీ.నాగప్పతో పదేళ్ల క్రితం వివాహమైంది. బ్రతుకుదెరువు కోసం బెంగళూరు వెళ్లిన ఈ దంపతులు అక్కడ సిద్దార్థ నివాసం ఉంటున్న ఇంటి పక్కనే బాడుగకు ఇల్లు తీసుకుని నివాసమున్నారు.  

వివాహేతర సంబంధానికి దారి తీసిన స్నేహం 
ఈక్రమంలో సిద్దార్ధ, శ్రీదేవిల మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా, చివరకు ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. శ్రీదేవితో కలిసి తమ సొంతూరికి మకాం మార్చిన సిద్దార్థ అనంతరం తన వద్ద ఉన్న కార్లను జల్సాల కోసం అమ్మేశాడు. అతని వద్ద ఉన్న సొమ్మునంతా కాజేసిన శ్రీదేవి తిరిగి భర్తను ఆశ్రయించింది. నాగప్పతో కలిసి ఉండేందుకు మళ్లీ బెంగళూరుకు చేరింది. మళ్లీ జీవనోపాధి కోసం సిద్దార్ధ కూడా బెంగళూరు చేరాడు. అయితే నాలుగేళ్ల క్రితం శ్రీదేవి, నాగప్ప కడేచూరుకు తిరిగొచ్చారు. శ్రీదేవిని చూడాలనుకుంటే సిద్దార్థ నేరుగా బెంగళూరు నుంచి వచ్చి కలిసి మాట్లాడేవాడు. ఓసారి శ్రీదేవి ఇకపై తన వద్దకు రావద్దని సిద్దార్థకు చెప్పడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేశాడు.  

చదవండి: (బడిలోనే బార్‌.. ఆ టీచరమ్మ రూటే వేరు)

వారించినా వస్తున్నాడనే... 
చివరికి సిద్దార్థ తల్లిదండ్రులు జరిగిందేదో జరిగింది, దాన్ని గురించి ఆలోచించకుండా యలసత్తిలో వ్యవసాయం చేసుకొమ్మన్నారు. అయినా ఇటీవల శ్రీదేవిని చూడాలనే ఆశతో యలసత్తి నుంచి సిద్దార్థ కడేచూరుకు వచ్చాడు. ఎంత వారించినా తరచూ వస్తున్నాడని కోపం పెంచుకున్న శ్రీదేవి, ఆమె భర్త నాగప్ప, నాగప్ప తల్లి మహదేవమ్మ, సోదరుడు తిరుపతి కలసి సిద్దార్ధను బాడియాళ పారిశ్రామికవాడలో కొట్టి హత్య చేశారని యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకుని నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై సైదాపుర పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కాళప్ప బడిగేర్‌ కేసు నమోదు చేసుకోగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బసవరాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు