తల్లిపై కోపంతో కుమారుడి హత్య

21 Nov, 2021 02:14 IST|Sakshi
లక్కీ (ఫైల్‌) 

పహాడీషరీఫ్‌: వదిన తన కాపురంలో చిచ్చు పెడుతోందంటూ అనుమానించి ఆమె కుమారుడిని హత్య చేశాడో కిరాతకుడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సి.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్‌ గృహకల్ప ప్రాంతానికి చెందిన సినీ ఆర్టిస్ట్‌ మహేశ్వరి, రాజు దంపతులకు శ్రీతనా, తేజస్వీ కుమార్తెలు ఉన్నారు. భర్త రాజు చనిపోవడంతో మహేశ్వరి.. వినోద్‌కుమార్‌రెడ్డిని రెండో వివాహం చేసుకుంది.

వీరికి లక్ష్మీనర్సింహ అలియాస్‌ లక్ష్మి (4) సంతానం. ఇదిలా ఉండగా మహేశ్వరి చెల్లెలు లక్ష్మీ తన భర్త వీరేశ్‌తో గొడవపడి శ్రీరాం కాలనీలోని తల్లిగారింటి వద్దే ఉంటోంది. బొల్లారంలో నివాసం ఉండే వీరేశ్‌.. భార్యను తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తన భార్య కాపురానికి రాకుండా మహేశ్వరి లేనిపోని మాటలు నేర్పుతోందంటూ ఆమెపై వీరేశ్‌ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 9.30 గంటలకు మహేశ్వరి ఇంటికి వచ్చాడు.

లక్కీని శ్రీరాం కాలనీలోని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత లక్కీ ఇంటికి వచ్చాడా అని మహేశ్వరి తల్లిగారింటికి ఫోన్‌ చేసి ఆరా తీయగా రాలేదని తెలిసింది. వీరేశ్‌కు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానంతో వెంటనే మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.   

డయల్‌ 100కు ఫోన్‌తో వెలుగులోకి.. 
శ్రీరాం కాలనీ ఇందిరాగాంధీ సొసైటీ ప్రాంతంలోని డంపింగ్‌ యార్డు సమీపంలో ఓ పాడుబడిన గది వద్ద బాలుడి మృతదేహం ఉండటాన్ని గమనించిన పారిశుధ్య కార్మికులు డయల్‌ 100కు కాల్‌ చేశారు. పోలీసులు పరిశీలించగా బాలుడి మెడ చుట్టూ వైరు చుట్టి నులమడంతో పాటు తలను బండకేసి బాది హత్య చేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. 

మరిన్ని వార్తలు