వ్యాపారిని హతమార్చి.. శరీరాన్ని రెండు భాగాలు చేసి..

16 Aug, 2021 17:57 IST|Sakshi
హత్యకు గురైన దేవరకొండ నాంచారయ్య(ఫైల్‌)

కృష్ణా జిల్లాలో రెండు రోజుల కిందట జరిగిన హత్య   

నిందితుడు లొంగిపోవడంతో వెలుగులోకి..  

సాక్షి, వెలువోలు(చల్లపల్లి) : తండ్రీ కొడుకులు కలిసి ఒక వ్యక్తిని కసి తీరా నరికి చంపిన ఘటన కృష్ణా జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. హతుడి శరీరాన్ని రెండు భాగాలు చేసి మూట గట్టి కాలువలో తొక్కేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పమిడిముక్కల మండలం అగినిపర్రుకి చెందిన మటన్‌ వ్యాపారి గరికే ఏడుకొండలు తన కుమారుడితో కలిసి..సహచర మటన్‌ వ్యాపారి దేవరకొండ నాంచారయ్యను శనివారం చంపి కాలువలో పడేశానని ఆదివారం కూచిపూడి పోలీసులకు లొంగిపోవడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడు ఇచి్చన సమాచారంతో సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు.

కరకట్ట వెంబడి కేఈబీ కెనాల్లో వీరంకి వద్ద నుంచి శ్రీకాకుళం, వెలువోలు వరకూ గాలించారు. చల్లపల్లి మండలం వెలువోలు వద్ద రెండు ముక్కలుగా ఉన్న నాంచారయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తల నుంచి పొట్ట వరకూ భాగాన్ని మూటగట్టి కాలువలో తొక్కేశారు. కింది భాగాన్ని కాలువ గట్టుపై పడేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి అన్న కుమారుడుగోపీనాథ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చల్లపల్లి ఎస్‌ఐ డి.సందీప్‌ చెప్పారు. హత్యకు గల కారణాలను, పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తులో నిగ్గుతేల్చుతామని డీఎస్పీ మహబూబ్‌ బాషా తెలిపారు. అయితే వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు స్థానికులు చెప్పుకొంటున్నారు. 

మరిన్ని వార్తలు