ఆ సమయంలో ఆమెకు అక్కడేం పని.. కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

26 Aug, 2021 18:09 IST|Sakshi

Mysore Gang Rape Case: మైసూర్ శివార్ల‌లో పరిశోధక విద్యార్ధినిపై ఆరుగురు వ్య‌క్తుల సామూహిక లైంగిక దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి క‌ర్ణాట‌క హోంమంత్రి అర‌గ జ్ణానేంద్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. లైంగిక దాడి ఘ‌ట‌నను ఉద్దేశిస్తూ.. రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో ఆమెకు అక్కడేం పని అని అంటూ బాధితురాలని కించపరిచేలా వ్యాఖ్యానించారు. బాధితురాలు ఆమె స్నేహితుడు అక్క‌డికి కాకుండా వేరే నిర్జ‌న ప్ర‌దేశానికి వెళ్లాల్సింద‌ంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఏదిఏమైనప్పటికీ.. ఈ ఘ‌ట‌న అమానుష‌మని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మైసూరులో ఘటన జరిగితే కాంగ్రెస్‌ త‌నను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ.. తనపై బుర‌ద చ‌ల్లే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ వ్యవహారం చూస్తే.. త‌న‌పై లైంగిక దాడికి ప్ర‌య‌త్నిస్తున్నట్లుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత బ్రిజేష్ క‌ల్లప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

హోం మంత్రి వ్యాఖ్య‌లు బాధ్య‌తారాహిత్యమ‌ని, తాను జవాబుదారిగా ఉండాల్సిన అంశంలో తనకేం సంబంధం లేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం మంత్రి అవగాహాన రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మరోవైపు ఈ ఘ‌ట‌నపై రాష్ట్ర బీజేపీ నేత ఎస్ ప్ర‌కాష్ కూడా స్పందించారు. ఇలాంటి సున్నిత‌మైన అంశాలను రాజ‌కీయం చేయ‌రాద‌ని, హోం మంత్రి కూడా బాధ్య‌తాయుతంగా మాట్లాడాల్సిందని అన్నారు. 
చదవండి: తల్లి అయిన టీఎంసీ ఎంపీ, విషెస్‌ చెప్పిన మాజీ భర్త

మరిన్ని వార్తలు