Mysuru Case: వీడియోలు తీసి.. 3 లక్షలు డిమాండ్‌ చేశారు

27 Aug, 2021 15:19 IST|Sakshi

రాచనగరి గుండెల్లో గుబులు

యువతిపై సామూహిక  అత్యాచారం కేసు.. 

ఇప్పటికీ దొరకని నిందితులు  

వీడియోలు తీసి రూ.3 లక్షలు డిమాండ్‌

సాక్షి, బెంగళూరు/మైసూరు: ప్రశాంత రాచనగరం నేరాలతో తల్లడిల్లుతోంది. మైసూరు నగరంలోని చాముండి కొండ తప్పలిలో ఉన్న లలితాద్రిపురం సమీపంలో యువతిపైన ఇద్దరు  అత్యాచారానికి పాల్పడిన కేసులో దుండగులు కరడుగట్టిన నేరస్తులుగా భావిస్తున్నారు. గ్యాంగ్‌ రేప్‌ దృశ్యాలను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశామని, రూ.3 లక్షలు ఇస్తే సరి, లేదంటే ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో, ఇంటర్నెట్లో పెడతామని బాధితురాలి స్నేహితునికి ఫోన్‌చేసి హెచ్చరించారు. మంగళవారం రాత్రి యువతీ యువకుడు కలిసిఉండగా, ఇద్దరు దుండగులు యువకున్ని కొట్టి, యువతిపై దారుణానికి ఒడిగట్టడం తెలిసిందే. అప్పటినుంచి పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.  

ఫోన్‌చేసి డబ్బు డిమాండ్‌ .. 
యువతీ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అఘాయిత్యం జరిపి పరారైన దుండగులు కొంతసేపటికి తనకు ఫోన్‌ చేశారని యువతి స్నేహితుడు తెలిపాడు. వీడియోల పేరుతో రూ. 3లక్షలు డిమాండ్‌ చేశారని పోలీసులకు వివరించాడు. అత్యాచారం, బెదిరింపుల సంగతిని పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని దుండగులు బెదిరించారని తెలిపాడు. తమపైన ఎలాంటి కేసు నమోదైనా వెంటనే వీడియోలను సోషల్‌ మీడియాలో, నెట్లో వైరల్‌ చేస్తామని బెదిరించారు. కాగా, బాధితురాలు ప్రాణాలకు ప్రమాదం లేదని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. దుండగులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నారని, పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారని యువతి స్నేహితుడు చెప్పాడు.  

మొబైల్స్‌ ఆధారంగా దర్యాప్తు..  
దుండగుల కోసం పోలీసులు పరిసర మొబైల్‌ టవర్లలో నమోదైన మొబైల్‌ఫోన్‌ నంబర్లను సేకరించి నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనపై ఆళణహళ్లి పీఎస్‌లో కేసు నమోదైంది. ఆగస్టు 24వ తేదీ రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో దారుణం జరిగినట్లు గుర్తించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న మొబైల్‌ ఫోన్ల నంబర్లను ఆరా తీస్తున్నారు. అనుమానం ఉన్న వారిని పిలిచి పోలీసులు విచారణ చేస్తున్నరని అదనపు డిజిపి ప్రతాపరెడ్డి తెలిపారు. ప్రత్యేక బృందాలు గాలింపు సాగిస్తున్నాయన్నారు. పోలీస్‌ కమిషనర్‌ చంద్రగుప్త మాట్లాడుతూ మరికొన్ని గంటల్లో నిందితులను పట్టుకుంటామని చెప్పారు.   

మహిళా కమిషన్‌ రాక ..   
రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ప్రమీళా నాయుడు గురువారం మైసూరుకు వచ్చి యువతిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. పోలీసు అధికారులను కలిసి విచారణ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. మీడియాతో మాట్లాడుతూ దుండగుల ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు చెప్పారన్నారు. అతి త్వరలోనే వారిని పట్టుకొంటారన్నారు.  

ఆమె షాక్‌లో ఉంది: హోంమంత్రి..  
యశవంతపుర: మైసూరులో లైంగికదాడిని సీరియస్‌గా పరిగణించినట్లు హోంమంత్రి అగర జ్ణానేంద్ర తెలిపారు. ఇంకా ఎవరినీ అరెస్ట్‌ చేయలేదన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆమె షాక్‌లో ఉన్నందున ఆమె నుంచి వివరాలను సేకరించడం సాధ్యం కావడం లేదన్నారు.

పోలీస్‌ ఉన్నతాధికారులు మైసూరులో ఉండి నిందితులను పట్టుకోవడానికి పనిచేస్తున్నారని తెలిపారు. బాధిత యువతి ఇతర రాష్ట్రాలకు చెందినవారని చెప్పారు. పర్యాటక కేంద్రంలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ రాజకీయం చేయడం సరికాదని, వారి హయాంలో జరగలేదా? అని ప్రశ్నించారు.  

చదవండి: దారుణం: మద్యం తాగి యువతిపై సామూహిక అత్యాచారం

>
మరిన్ని వార్తలు