హెచ్‌సీయు విద్యార్థి: వీడని విద్యార్థిని ఆత్మహత్య మిస్టరీ!

25 Aug, 2021 19:22 IST|Sakshi
రగుసాల మౌనిక

సాక్షి, కాల్వశ్రీరాంపూర్‌(కరీంనగర్‌): హైదరాబాద్‌లో ఎంటెక్‌ విద్యార్థి రగుసాల మౌనిక ఆత్మహత్య చేసుకోవడంతో స్వగ్రామం తారుపల్లి శోకసంద్రంలో మునిగింది. గ్రామానికి చెందిన రగుసాల లచ్చయ్య రజితకు మమత, మౌనిక ఇద్దరు కూతుళ్లు, మమతకు డిగ్రీ తర్వాత వివాహం చేశారు. మౌనిక స్థానిక ప్రభుత్వపాఠశాలలో పదోతరగతి చదివి స్కూల్‌ టాపర్‌గా నిలిచి బాసర ట్రీపుల్‌ ఐటీలో చదువు పూర్తిచేసింది. హైదరాబాద్‌లో ఎంటెక్‌ నానోసైన్స్‌ టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల కళాశాల పిలుపు మేరకు హైదరాబాద్‌ వెళ్లి హాస్టల్‌లో చేరింది.

సోమవారం హాస్టల్‌ గదిలో తమ కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న వార్త ఆ తల్లి దండ్రులను షాక్‌కు గురిచేసింది. కూతురు మరణవార్తతో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన సమాచారంతో.. తండ్రి లచ్చయ్య గ్రామస్తుల సాయంతో కూతురు మృతదేహన్ని తీసుకువచ్చేందుకు హైదరాబాద్‌ తరలివెళ్లారు. తమ కూతురు ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం ఒత్తిడి, నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మౌనిక మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తనతో ఫొన్‌లో మాట్లాడిందని తల్లి రజిత విలపిస్తూ చెప్పింది. చిన్నబిడ్డకు ఇంత గతి పట్టించావా దేవుడా అంటూ రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.  

చదువులో ముందు.. 
మౌనిక చిన్నప్పటినుంచి చదువులో ముందజలో ఉండేదని అత్యంత ప్రతిష్టాత్మకమైన నానోసైన్స్‌ టెక్నాలజీలో సీటు పొందిందన్న సంతోషం తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఎంతోకాలం నిలవలేదు. జెడ్పీహైస్కూల్లో మౌనికకు చదువుచెప్పిన గురువులు ఆత్మహత్య చేసుకుందన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.  

సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ కీలకం.. 
మౌనిక ఆత్మహత్యకు కారణలేమిటన్నది పోలీసులకు సవాలుగా మారింది. మౌనికది ముమ్మాటికీ ఆత్మహత్యే అంటున్న పోలీసులు ఆమె వినియోగించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ కీలక ఆధారం కావొచ్చని పేర్కొంటున్నారు. హాస్టల్లో సహావిద్యార్థిని, క్లాస్‌మెంట్స్‌ను విచారిస్తున్నామని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుంటామని తల్లిదండ్రులకు గచ్చిబౌలి డీఎస్పీ తెలిపారు. మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.  

చదవండి:  మమ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది 

మరిన్ని వార్తలు