Vijayawada Fathima Murder Case: వీడిన ఫాతిమా హత్య కేసు మిస్టరీ..

10 Aug, 2021 18:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఫాతిమా మిస్సింగ్‌ కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. తయ్యబ్‌ సాయంతో ఫాతిమాను వాసిమ్‌ హత్య చేశాడని ఏడీసీపీ బాబురావు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన కేసు వివరాలను వెల్లడిస్తూ.. గత నెల 11న తేదిన చిట్టినగర్‌ పీఎస్‌ పరిధిలో నజీర్‌ అనే వ్యక్తి తన కుమారై కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఫాతిమా మానసిక రోగంతో బాధపడేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ఆమె వ్యాధి నయం చేయించడానికి యూపీకి చెందిన వాసిఫ్‌ అనే భూత వైద్యుడి దగ్గర చికిత్స కోసం తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తమ స్వస్థలానికి వచ్చిన వాసిఫ్‌ ఆమెకు మాయమాటలు చెప్పి.. ఢిల్లీకి తీసుకుపోయాడు. అక్కడి నుంచి సహారంగ్‌ పూర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి కాపురం పెట్టాడు. దీంతో వాసిఫ్‌ మొదటి భార్య గొడవకు దిగింది. ఈ క్రమంలో వాసిఫ్‌ .. ఫాతిమాను వదలించుకోవాలనుకున్నాడు. దీనికోసం తన స్నేహితుడు తయ్యబ్‌ సహకారం తీసుకున్నాడు.

ఇద్దరు కలసి ఫాతిమాకు మాయమాటలు చెప్పి సహరంగ్‌పూర్‌లోని హత్నికుండ్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి జలశయంలో తోసేశారు. కాగా, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆమె మృత దేహం పోలీసులకు దొరికింది. కాగా, సహరంగ్‌ పోలీసులు సహకరంతో.. మృత దేహన్ని స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు.. నిందితులిద్దరినీ ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా విజయవాడకు రప్పించారు.

కాగా, నిందితులను అదుపులోకి తీసుకుని విజయవాడ కోర్టులో హజరుపర్చారు. నిందితులిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వీరిని మచిలీపట్నం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, వాసిఫ్‌ వద్ద 60 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మాయగాళ్లను నమ్మవద్దని విజయవాడ పోలీసు అధికారి బాబూరావు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఙప్తి చేశారు. 

మరిన్ని వార్తలు