నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి..

27 Mar, 2022 13:02 IST|Sakshi
కళావతి(ఫైల్‌)

రాయచోటి(వైఎస్సార్‌ జిల్లా): రాయచోటి రూరల్‌ మండల పరిధిలోని అనుంపల్లె అటవీ ప్రాంతంలో ఈనెల 11న కాలిన స్థితిలో శవమై తేలిన మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. రాయచోటి పట్టణంలోని సుండుపల్లె మార్గం పరిధిలో నివాసం ఉంటున్న కళావతి(50)గా గుర్తించారు. సహజీవనం చేసే వ్యక్తే నగల కోసం ఆమెను హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. శనివారం ఆయన రాయచోటిలో వివరాలు వెల్లడించారు.హోటల్స్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగించే కళావతి రామాపురం మండలం హసనాపురం దళితవాడకు చెందిన పూదోట గురవయ్య(40)తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది.

చదవండి: భార్యతో గొడవ.. ఇంటికి నిప్పుపెట్టి.. ఆపై ఎంత పనిచేశాడంటే..

ఈ క్రమంలో ఆమె ఒంటిపై ఉన్న నగలు కాజేయాలని పథకం పన్నిన గురవయ్య  తన ఆటోలో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం బంగారు నగలు తీసుకొని మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఉడాయించాడు. నిందితుడు గురవయ్య శనివారం రింగ్‌రోడ్డు పరిధిలోని గున్నికుంట్ల కూడలిలో ఆటోలో అనుమానాస్పద స్థితిలో వెళ్తుండగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యోదంతాన్ని బయట పెట్టాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు.  అనతి కాలంలోనే హత్యకేసును ఛేదించిన రాయచోటి డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను ఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు