ప్రేమోన్మాది నాగేంద్రబాబు అరెస్ట్‌

7 Nov, 2020 10:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రేమోన్మాదంతో విచక్షణా రహితంగా తన ప్రియురాలిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన నాగేంద్రబాబును దిశ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ప్రియురాలిపై కత్తితో దాడి చేశాక.. తానూ ఆత్మహత్యాయత్నం చేసుకొని చావుబతుల్లో ఉన్న నాగేంద్రబాబును గత నెల 15న పోలీసులు గుంటూరు ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. 21 రోజులపాటు చికిత్స పొందిన నాగేంద్రబాబుకు ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు అతడిని శుక్రవారం డిశ్చార్జి  చేశారు. ఆ వెంటనే విజయవాడ దిశ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

విజయవాడలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22)ని అదే ప్రాంతానికి చెందిన బుడిగి నాగేంద్రబాబు కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దిశ పోలీసులు పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. నాగేంద్ర వెల్లడించిన ఆరుగురు స్నేహితులను కూడా ప్రత్యేక బృందం ఇంటరాగేట్ చేయనుంది. హత్య కేసులో ఇప్పటికే 45 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. నేడు మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో హాజరు పరచనున్నారు. సమగ్ర విచారణ కోసం పోలీసులు వారం రోజుల కస్టడీకి కోరే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు