రోడ్డు ప్రమాద మృతులకు రూ. 25 లక్షలు ఇవ్వాలి: బీజేపీ

22 Jan, 2021 11:37 IST|Sakshi

పీఏ పల్లి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన నాయకులు

సాక్షి, పెద్దఅడిశర్లపల్లి/కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలోని హైదరాబాద్‌ – నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక నేడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. 

దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత
ఇక ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిందిగా బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రి బయట ఆందోళన చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.
(చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం: సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి)

దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెద్ద అడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం, పోతునూరు గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని అదే ఆటోలో తిరుగు పయనమయ్యారు. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట క్రాస్‌రోడ్‌ సమీపంలోని ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకి రాగానే హైదరాబాద్‌ నుంచి సాగర్‌ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఓవర్‌టేక్‌ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా  కూలీలు వెళ్తున్న ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది. బొలోరో వాహనం కూడా అదుపుతప్పి బోల్తాపడింది.

మరిన్ని వార్తలు