ఓటుకు కోట్లు కేసులో నిందితులకు ఈడీ కోర్టు సమన్లు

28 Aug, 2021 12:47 IST|Sakshi
రేవంత్ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

అక్టోబర్‌ 4న విచారణకు హాజరు కావాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఈడీ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి (ఎంఎస్‌జే) కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నిందితులుగా మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి, టీడీపీ మైనారిటీ సెల్‌ ప్రతినిధి హ్యారీ సెబాస్టియన్, రుద్ర ఉదయసింహ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతోపాటు జెరూసలెం మత్తయ్య, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం క్రిష్ణకీర్తన్‌లనూ చేర్చింది. అక్టోబర్‌ 4న వారిని ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎంఎస్‌జే తుకారాంజీ సమన్లు జారీ చేశారు.

ఈడీ అభియోగపత్రం ప్రకారం నిందితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనీలాండరింగ్‌కు సహకరించడం లేదా ఆ కుట్రలో భాగస్వామి కావడం తదితర అభియోగాలు ఉన్నాయి. వారిపై నేరం రుజువైతే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో కీలక సాక్షుల విచారణ పూర్తయ్యింది. అయితే ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదంటూ ఇటీవల ఎంపీ రేవంత్‌రెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

వీరి పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు..  ప్రత్యేక కోర్టు విచారణను నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రేవంత్‌ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 

చదవండి: తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..!

>
మరిన్ని వార్తలు