కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు బలవన్మరణం

29 May, 2021 10:39 IST|Sakshi
అనూష మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం 

సాక్షి, నల్గొండ: కాళ్లపారాణి ఆరకముందే ఓ నవ వధువు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం మర్రిబావితండాలో శుక్రవారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిబావితండాకు చెందిన సభావత్‌ పుల్యా కూతురు అనూష (21)కు నాంపల్లి మండలం పెద్దపురంతండాకు చెందిన మధుతో ఈ నెల 26న వివాహం జరిగింది. 27న వరుడు ఇంటి వద్ద రిసెప్షన్‌ నిర్వహించారు. అదే రోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో వధూవరులు మర్రిబావితండాకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం అనూష తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.

రాత్రి నిద్ర సరిపోక పడుకుని ఉంటుందని కుంటుంబ సభ్యులు భావించారు. సాయంత్రం గదిలోకి వెళ్లి చూడగా అనూష తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకి దించి చూడగా అప్పటికే మృతిచెందింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఎస్‌ఐ సుధాకర్‌రావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. నవ వధువు ఆత్మహత్యతో తండాలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ భయం: మగ్గానికి ఉరేసుకున్న బాధితుడు

మరిన్ని వార్తలు