నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్‌ 

15 May, 2021 03:59 IST|Sakshi

ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో కేసు నమోదు 

సాక్షి, అమరావతి, హైదరాబాద్‌: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని మణికొండ జాగీర్‌ గోల్ఫ్‌కోర్సు బౌల్డర్స్‌హిల్స్‌లోని విల్లా నెంబర్‌ 17లో ఉంటున్న ఆయన నివాసానికి శుక్రవారం వెళ్లిన సీఐడీ బృందం.. అరెస్టు కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులకు సెక్షన్‌ 50 నోటీసును జారీ చేసింది. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయనకు భద్రత కల్పిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తొలుత ఆయన్ను అరెస్టు చేయనీయకుండా వలయంగా అడ్డుపడ్డారు. వారికి సీఐడీ పోలీసులు అరెస్టుకు సంబంధించిన కారణాలు వివరించడంతో వెనక్కి తగ్గారు. ఈ సందర్బంగా రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్, కుటుంబ సభ్యులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.   
రఘురామకృష్ణరాజును గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్న దృశ్యం   

తగిన ఆధారాలతోనే.. 
ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిపై రఘురామకృష్ణరాజు చేస్తున్న ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలపై ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐడీ తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేసింది. ఇటీవల కొన్ని న్యూస్‌ చానల్స్, కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో రఘురామకృష్ణరాజు రోజువారీగా వీడియో ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలను చేస్తున్నట్టు గుర్తించిన ఏపీ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించారు. ‘పథకం ప్రకారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వంపై కొన్ని వర్గాలను రెచ్చగొట్టేందుకు, కొన్ని సామాజిక వర్గాలను పురిగొల్పేందుకు ఆయన వ్యాఖ్యానాలు చేశారు. కొన్ని సామాజిక వర్గాలను, వ్యక్తులను కించపరిచేలా మాట్లాడారు. రోజువారీ వీడియో ఉపన్యాసాల ద్వారా పథకం ప్రకారం పలు సామాజిక వర్గాల్లో అభద్రత, ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ముఖ్యులపై, ప్రభుత్వంపైన కించ పరిచే విమర్శలు చేయడంతోపాటు ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన ఉపన్యాసాలు, హావభావాలు ప్రభుత్వంపై ద్వేషం పెంచేలా, ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని చులకన చేసి మాట్లాడటం చేస్తున్నారు. పథకం ప్రకారం ప్రభుత్వంపై వరుసగా వీడియో ఉపన్యాసాలు చేస్తున్నారు. తద్వారా సామాజిక వర్గాలు, ప్రజల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు’ అని ఈ విచారణలో స్పష్టమైంది. ప్రాథమికంగా లభించిన ఈ ఆధారాలతో సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌ కుమార్‌ ఆదేశాలతో రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు 124(ఎ), సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు 153(ఎ), బెదిరింపులకు పాల్పడటం 505, కుట్ర పూరిత నేరం 120(బి) సెక్షన్లపై కేసు నమోదైంది. ఈ కేసులో రఘురామకృష్ణరాజును అరెస్టు చేశామని, కోర్టుకు తరలిస్తామని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌ తెలిపారు. కాగా, శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన్ను గుంటూరులోని సీఐడీ రీజనల్‌ కార్యాలయానికి తరలించారు.  అనంతరం అదనపు డీజీ సునీల్‌కుమార్‌ అక్కడికి చేరుకున్నారు.

పుట్టిన రోజునే అరెస్టు చేశారు 
‘మా నాన్నను పుట్టిన రోజు నాడు అరెస్టు చేయడం అన్యాయం’ అని రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ ఆరోపించారు. నాలుగు నెలల క్రితమే ఆయనకు బైపాస్‌ సర్జరీ అయ్యిందని, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని అన్నారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు