పిల్లల్ని అమ్మేస్తామని బెదిరించి పెళ్లి..?

1 Jan, 2021 08:22 IST|Sakshi

మహారాష్ట్రలో 8 నెలల నరకం

ఎట్టకేలకు ఇంటికి చేరిన వివాహిత

వేములవాడ: ‘నీ ఇద్దరు పిల్లల్ని అమ్మేస్తాం’ అని బెదిరించి వేములవాడ పట్టణానికి చెందిన ఓ వివాహితను బలవంతంగా మహారాష్ట్రలోని నాసిక్‌ ప్రాంతానికి చెందిన బాబు లక్ష్మణ్‌ జగవత్‌కు మూడో పెళ్లి చేసిన వైనం వెలుగు చూసింది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మహిళకు నాలుగేళ్ల కుమారుడు, ఏడాది పాప ఉన్నారు. ఇంట్లో తరచూ భర్తతో గొడవ కావడంతో విసుగెత్తిన ఆమె మార్చి 4న ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేములవాడ నుంచి కామారెడ్డి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరింది. అక్కడే మూడు రోజు గడిపింది. ఈ విషయాన్ని గమనించిన ఓ వృద్ధురాలు వివాహితను చేరదీసినట్లు నటించింది. పని ఇప్పిస్తానని చెప్పి మహారాష్ట్రలోని పర్భాని ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడే ఉన్న రాజారాం అనే వ్యక్తికి రూ. లక్షకు అమ్మేసింది. పది రోజుల పాటు తనవద్దే ఉంచేసుకున్న రాజారాం నాసిక్ ప్రాంతంలో ఉండే తన బావమరిది బాబు లక్ష్మణ్‌ జగపత్‌కు అప్పగించాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతడిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే పిల్లల్ని ఎత్తుకొచ్చి అమ్మేస్తానని బెదిరించి బలవంతంగా మూడో పెళ్లి చేశాడు.(చదవండి: టీఆర్‌ఎస్, బీజేపీ పరస్పర దాడులు )

ఫోన్‌ ట్రాకింగ్‌తో..
8 నెలల క్రితం అదృశ్యమైన వివాహిత ఆచూకీ లభ్యం కాలేదు. ఓ రోజు తన ఆడపడుచుకు, తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ రావడంతో విషయం బయటపడింది. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా వేములవాడ పోలీసులు ఆ ప్రాంతాన్ని కనుగొన్నారు. ఓ పోలీసు బృందం నాసిక్‌ చేరుకుని వివాహిత కోసం ఆరా తీసింది. ఆమెను మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని ఈనెల 28న వేములవాడకు తీసుకువచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లక్ష్మణ్‌ జగపత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సమస్యలు పరిష్కరించుకోవాలి: సీఐ
ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలకు వివాహితలు బయటికి వెళ్లిపోయి మాయ మాటలు చెప్పే వారి ఉచ్చులో పడవద్దని టౌన్‌ సీఐ వెంకటేశ్‌ ఈ సందర్భంగా సూచించారు. బంధువల సమక్షంలో సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు