ఆయుధాలు స్మగ్లింగ్‌.. జాతీయ క్రీడాకారుడు అరెస్ట్‌

21 Oct, 2021 18:18 IST|Sakshi

భోపాల్‌: ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న జాతీయ కబడ్డీ క్రీడాకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు మరో ముగ్గురు కూడా పోలీసులకు చిక్కారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి 5 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన రింకు జాట్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు. అతను గతంలో ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్లతో పాటు దబాంగ్ ఢిల్లీ జట్టు తరపున ఆడాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి క్రెటా కారులో గుణ వైపు నుంచి శివపురి వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఓ బృందంగా ఏర్పడి మైనా ఓవర్ బ్రిడ్జికి చేరుకొని ఆ రూటును పోలీసులు బ్లాక్‌ చేశారు. కొంతసేపటికి నిందితులు కారు అటు వైపు రావడంతో ఆ కారుని ఆపి అందులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుల నుంచి 5 పిస్టల్ మ్యాగజైన్‌లతో సహా మూడు అదనపు మ్యాగజైన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుర్హాన్‌పూర్‌కు చెందిన సిగ్లిగార్‌ల నుంచి పిస్టల్స్ తీసుకువచ్చినట్లు నిందితులు విచారణలో చెప్పారు.  వీటిని సరఫరా చేసిన వ్యక్తి సమాచారం కూడా నిందితులు ఇ‍వ్వడంతో అతన్ని అరెస్ట్‌ చేసేందుకు ఒక బృందాన్ని కూడా అక్కడకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. చీటింగ్‌ కేసు నమోదు

మరిన్ని వార్తలు