సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా

25 May, 2021 12:36 IST|Sakshi
గాలింపు చర్యలు, లభ్యమైన పసిబిడ్డ మృతదేహం

విశాఖపట్నం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడ బోల్తా పడ్డాయి. ఈ ఘటన సీలేరుగుంట వాడ దగ్గర జరిగింది. ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులు. హైదరాబాద్ శివారులో ఇటుకుల బట్టిలో పనికి వెళ్లి కోవిడ్ భయంతో  35మంది గ్రామానికి బయలుదేరారు. సీలేరు రెజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై తొలి విడతగా కొందరు గ్రామానికి చేరుకున్నారు.

ఇక రెండో ట్రిప్‌లో అయిదు పడవల్లో వెళ్తుండగా రెండు పడవలు నీట మునిగాయి.11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. రిజర్వాయర్ వద్ద గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

ఈ ఘటనపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆరా తీశారు. సీలేరు జెన్‌కో అధికారులతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరారు.

సీలేరు నాటు పడవల ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులు ఒడిశా వాసులైనా పూర్తి సహాయం అందించాలని అధికారుకు తెలిపారు. అవసరమైతే నేవీ సహాయం తీసుకోమని మంత్రి అవంతి అధికారులను ఆదేశించారు.

చదవండి: హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు 

మరిన్ని వార్తలు