గోవాలో హైదరాబాదీపెడ్లర్‌ అరెస్ట్‌

27 Sep, 2021 04:24 IST|Sakshi

ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌కు ఎల్‌ఎస్‌డీసప్లయి చేస్తున్న సిద్దిఖ్‌ 

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డ్రగ్‌ పెడ్లర్‌ నౌమన్‌ సవేరీతో భాగస్వామ్యం  

హైదరాబాద్‌లో ఎండీఎమ్‌ఏ తయారీ జరుగుతోందని వెల్లడి  

ముంబయి డ్రగ్‌ మాఫియా పెట్టుబడితో పలు కంపెనీల్లో ఉత్పత్తి 

అన్ని కోణాల్లో దర్యాప్తునకు సిద్ధమవుతున్న ఎన్సీబీ 

సాక్షి, హైదరాబాద్‌:  గోవా డ్రగ్‌ రాకెట్‌లో హైదరాబాద్‌ యువకుడు పట్టుబడటం సంచలనం రేపుతోంది. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) వారం రోజులు జల్లెడ పట్టి డ్రగ్స్‌ దందా సాగిస్తున్న నలుగురిని అరెస్ట్‌ చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన సిద్దిఖ్‌ అహ్మద్‌ కూడా ఉన్నాడు. ఇప్పటికే డ్రగ్స్‌కు సంబంధించిన ఒక కేసులో టాలీవుడ్‌కు చెందిన 12 మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారించింది.

అదే కేసులో మనీలాండరింగ్‌ అనుమానంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా దర్యాప్తు జరిపింది. ఇంతలోనే గోవాలో సిద్దిఖ్‌ పట్టుబడటంతో.. డ్రగ్స్‌ మాఫియాలో హైదరాబాద్‌ లింకు మరోసారి చర్చనీయాంశమయ్యింది..  

ఛత్తీస్‌గఢ్‌ వ్యక్తితో కలిసి.. 
సిద్దిఖ్‌ అహ్మద్‌ అరెస్టుకు సంబంధించి గోవా ఎన్సీబీ అధికారులను ఆరా తీయగా సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నౌమాన్‌ సవేరీతో కలిసి సిద్దిఖ్‌ గోవాలో డ్రగ్స్‌ను (ఎల్‌ఎస్‌డీ, ఎమ్‌డీఎమ్‌ఏ) సరఫరా చేస్తున్నాడు. గత బుధవారం సవేరీని ఎన్సీబీ అరెస్టు చేసి విచారించగా తనతో పాటు ప్రధాన భాగస్వామి సిద్దిఖ్‌ అహ్మద్‌ ముంబయితో పాటు హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు డ్రగ్స్‌ రవాణా (పెడ్లింగ్‌) చేస్తున్నాడని వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే శనివారం అర్ధరాత్రి సిద్దిఖ్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు.  

పుట్టి పెరిగిందంతా ఇక్కడే... 
సిద్దిఖ్‌ అహ్మద్‌ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే అని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం గోవాలోని సియోలిమ్‌ బీచ్‌ ప్రాంతంలో సెటిల్‌ అయ్యాడని, ఆ బీచ్‌ కేంద్రంగానే డ్రగ్‌ పెడ్లర్‌గా మారి ప్రధానంగా ముంబయి, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలైన లైసర్జిక్‌ యాసిడ్‌ డైతల్మైడ్‌ (ఎల్‌ఎస్‌డీ), మిథలిన్‌ డయాక్సీ మెథమాపెటమైన్‌ (ఎండీఎమ్‌ఏ) సరఫరా చేస్తున్నట్టు విచారణలో బయటపడిందని తెలిపారు.

అయితే సిద్దిక్‌ హైదరాబాద్‌ నుంచి గోవాకు ఎందుకు మకాం మార్చాడన్న దానిపై ఎన్సీబీ దృష్టి పెట్టింది. గోవా కేంద్రంగా భారీ స్థాయిలోనే నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని ఉంటాడా? అనే కోణంలో విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది.  

హైదరాబాద్‌లో ఎండీఎమ్‌ఏ తయారీ? 
సిద్దిఖ్‌ విచారణలో కొన్ని ఆందోళన కల్గించే అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముంబయికి చెందిన డ్రగ్స్‌ మాఫియా హైదరాబాద్‌లోని కొన్ని పారిశ్రామిక కంపెనీల్లో ఎండీఎమ్‌ఏ డ్రగ్‌ను తయారు చేయిస్తోందని, అక్కడి నుంచే గోవా, బెంగళూరు, ముంబయి ప్రాంతాలకు రవాణా అవుతోందని అతను వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సిద్దిఖ్‌ దగ్గరున్న వివరాల ఆధారంగా ముంబయి డ్రగ్స్‌ తయారీ మాఫియాను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.  

రంగంలోకి స్థానిక అధికారులు 
సిద్దిఖ్‌ హైదరాబాద్‌లో పుట్టి పెరగడం, నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని ఉండటం.. హైదరాబాద్‌ ఎన్‌సీబీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సిద్దిఖ్‌ నివాసం ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం, అతడితో కాంటాక్ట్‌లో ఉండి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వారిని గుర్తించేందుకు ఇప్పటికే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రంగా ఎండీఎమ్‌ఏ తయారీ అంశం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రధానంగా దీనిపైనే దృష్టి సారించి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 

గోవా నుంచే ఈవెంట్లకు డ్రగ్స్‌!
హైదరాబాద్‌లో ఉన్న పరిచయాలు, బెంగళూరులో ఉన్న స్నేహితులు, ముంబయిలో ఉన్న డ్రగ్స్‌ మాఫియా ద్వారా సిద్దిఖ్‌ పలు ప్రత్యేక ఈవెంట్లకు ఎల్‌ఎస్‌డీ సరఫరా చేస్తున్నట్టు గోవా ఎన్‌సీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. పార్టీలకు పేరొందిన (మోస్ట్‌ హ్యాపెనింగ్‌) మెట్రో సిటీల్లో వీకెండ్‌ హంగామాకు అంతేలేదు. పబ్‌ కల్చర్‌ విపరీతంగా ఉన్న నగరాలు కావడం వరుసగా డ్రగ్‌ కేసులు వెలుగులోకి రావడం ఎన్సీబీని కలవరపెడుతోంది. గోవా కేంద్రంగా ఎల్‌ఎస్‌డీని ఈ మూడు ప్రాంతాలకు సిద్దిఖ్‌ చేరవేస్తున్నట్టు అనుమానిస్తోంది.   

మరిన్ని వార్తలు