కొరియర్ ద్వారా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, ఛేదించిన ఎన్‌సీబీ

9 Aug, 2021 07:49 IST|Sakshi

బెంగళూరు టు ఆస్ట్రేలియా వయా హైదరాబాద్‌ 

సింథటిక్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణా 

గుట్టు రట్టు చేసిన నార్కోటిక్స్‌  కంట్రోల్‌ బ్యూరో 

అక్బర్‌బాగ్‌లో పట్టుబడిన  ఇద్దరు నిందితులు  

సాక్షి, సిటీబ్యూరో: సింథటిక్‌ డ్రగ్స్‌గా పిలిచే యాంఫిటమైన్, సైడో ఎఫిడ్రిన్‌లను నగరం నుంచి ఆస్ట్రేలియాకు అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రట్టు చేశారు. గత వారం బెంగళూరుతో పాటు నగరంలోని అక్బర్‌బాగ్‌ల్లో జరిపిన దాడుల్లో మొత్తం ముగ్గురిని పట్టుకున్నారు. వీరి నుంచి 3.9 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎన్సీబీకి చెందిన బెంగళూరు యూనిట్‌ చేపట్టింది. బెంగళూరుకు చెందిన సూత్రధారులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో ఈ సింథటిక్‌ డ్రగ్స్‌ తయారు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో భారీ డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో వీటిని ఆ దేశాలనికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికో సం ఈ గ్యాంగ్‌ పోలీసు, కస్టమ్స్‌ సహా ఇతర ఏజెన్సీల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వివిధ మా ర్గాలను అనుసరిస్తోంది.

తొలుత బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకు జిమ్‌ ఉపకరణాల మధ్యలో ఉంచి 2.5 కేజీల యాంఫిటమైన్‌ స్మగ్లింగ్‌ చేయడానికి ప్రయత్నించింది. దీనిపై సమాచారం అందుకున్న ఎన్సీబీ బెంగళూరు యూనిట్‌ గత నెల 6న అక్కడి ఓ కొరియర్‌ సంస్థపై దాడి చేసింది. ఇస్మాయిల్‌ అనే నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఆస్ట్రేలియాకు పార్శిల్‌ చేసిన డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామంతో కంగుతిన్న స్మగ్లర్లు తమ ‘రూటు’ మార్చారు. హైదరాబాద్‌ నుంచి పార్శిల్‌ చేయాలని పథకం వేశారు. ఈ విషయాన్నీ గుర్తించిన ఎన్సీబీ టీమ్‌ గత వారం నగరానికి చేరుకుంది.

చంచల్‌గూడ సమీపంలోని అక్బర్‌ బాగ్‌ ప్రాంతంలోని ఓ కొరియర్‌ కార్యాలయంపై కన్నేసి ఉంచింది. తమిళనాడుకు చెందిన ఎ.తాహెర్, ఆర్‌.మీరన్‌ను ఓ పార్శిల్‌తో అక్కడకు చేరుకున్నారు. ఎంబ్రాయిడరీ వస్తువుల పేరుతో ఆస్ట్రేలియాకు దాన్ని పంపాలని ప్రయత్నించారు. అక్కడే మాటు వేసి ఉన్న ఎన్సీబీ టీమ్‌ వారిని అదుపులోకి తీసుకుని పార్శిల్‌ను తనిఖీ చేసింది. అందులో 1.4 కేజీల సూడో ఎఫిడ్రిన్‌ పౌడర్‌ బయటపడింది. దీంతో ఆ ఇద్దరినీ అరెస్టు చేసిన అధికారులు బెంగళూరు తరలించి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపారు. ఈ గ్యాంగ్‌కు సూత్రధారులుగా ఉన్న కర్ణాటక వాసుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.  

చదవండి : Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి

మరిన్ని వార్తలు