బీదర్‌లో 91.5 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్న ఎన్‌సీబీ

27 Jun, 2021 08:05 IST|Sakshi
నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో పట్టుకున్న ఆల్ప్రాజోలం

సాక్షి, హైదరాబాద్‌: మరో డ్రగ్స్‌ రాకెట్‌ వెలుగుచూసింది. రూ.2 కోట్ల విలువైన ఆల్ప్రాజోలం మత్తు పదార్థాన్ని వ్యానులో తీసుకెళ్తుండగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) హైదరాబాద్‌–బెంగళూరు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో పట్టుకున్నారు. శుక్రవారం కర్ణాటకలోని బీదర్‌ శివారులో ఉన్న కోలార్‌ ప్రాంతంలో ఓ పరిశ్రమ ఉంది. దాన్ని హైదరాబాద్‌కు చెందిన ఎన్వీ రెడ్డి లీజుకు తీసుకున్నాడు. ఇందులో ప్రొడక్షన్‌ మేనేజర్‌ అమృత్, కెమిస్ట్‌వైవీ రెడ్డి, ఫైనాన్సియర్‌ భాస్కర్, అతడి అనుచరుడు మీనన్‌ గుట్టుచప్పుడు కాకుండా ఆల్ప్రాజోలం తయారుచేస్తున్నారు. బెంగళూరులో ఓ కేసు ద్వారా ఈ పరిశ్రమ గురించి బెంగళూరు ఎన్‌సీబీకి సమాచారం అందింది. బెంగళూరు నుంచి బీదర్‌కు చాలా దూరం కావడంతో హైదరాబాద్‌లోని ఎన్‌సీబీకి శుక్రవారం సమాచారం అందించారు. అదేరోజు రాత్రి హైదరాబాద్‌ ఎన్‌సీబీ అధికారులు బీదర్‌ వెళ్లి సదరు పరిశ్రమలో తనిఖీలు చేశారు.

ట్రక్కులో సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన 91.5 కిలోల ఆల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.90 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పారిపోయేందుకు యత్నించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటున్న పరిశ్రమ యజమాని ఎన్వీరెడ్డి ఇంట్లో తనిఖీలు చేసి రూ.62 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరి నెట్‌వర్క్‌ ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించినట్లు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. మత్తు స్వభావం కలిగి ఉన్న ఈ మందును కృత్రిమ కల్లు తయారీలో వాడుతారు. 

మరిన్ని వార్తలు