డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్ధా కపూర్‌ పేర్లు

22 Sep, 2020 04:10 IST|Sakshi

ఎన్‌సీబీ జాబితాలో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌ పేర్లు

ఈ వారంలోనే ఎన్‌సీబీ సమన్లు

సారా రకుల్‌ను విచారించే చాన్స్‌

ముంబై: సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై కొనసాగుతున్న దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణలో బాలీవుడ్‌కు చెందిన ఐదుగురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వీరిలో టాప్‌ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌ కూడా ఉన్నట్లు వినికిడి. త్వరలోనే వీరిద్దరికీ సమన్లు పంపే అవకాశాలున్నట్లు సమాచారం.

ఎన్‌సీబీకి లభ్యమైన డ్రగ్స్‌ సరఫరాదారుల ఫోన్లలోని వాట్సాప్‌ కోడ్‌ చాట్‌లను బట్టి..డ్రగ్స్‌ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ ప్రముఖుల్లో ప్రధానంగా కె, డి, ఎస్, ఎన్, జెల పేర్లు ఉన్నాయి. ఇందులో ‘డి’ని వైరల్‌గా మారిన కరణ్‌ జోహార్‌ పార్టీ వీడియోలో కనిపించిన దీపికా పదుకొణెగాను, ‘కె’ను దీపికా పదుకొణె మేనేజర్, క్వాన్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ఉద్యోగి అయిన కరీష్మాగా భావిస్తున్నారు. ‘ఎస్‌’అంటే శ్రద్ధా కపూర్‌ అనీ, ‘ఎన్‌’ను 90లలో బాలీవుడ్‌ ప్రముఖ నటి, ‘జె’ను జయ సాహాగా భావిస్తున్నారు. సుశాంత్‌తో కలిసి సారా అలీఖాన్‌ ‘కేదార్‌నాథ్‌’లోనూ శ్రద్ధాకపూర్‌ ‘చిభోర్‌’ సినిమాలోనూ నటించారు. వీరిద్దరూ కూడా సుశాంత్‌తో కలిసి పుణే సమీపంలోని ఓ దీవిలో జరిగిన పలు పార్టీల్లో పాల్గొన్నట్లు తాజా విచారణలో వెల్లడైందని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి.

ఎన్‌సీబీ అధికారులు సోమవారం సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహాను, మాజీ బిజినెస్‌ మేనేజర్‌ శ్రుతి మోదీని ప్రశ్నించారు. ఈ విచారణలో జయా సాహా.. మరికొందరు సినీ ప్రముఖల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు ఎన్‌సీబీ ఈ వారంలోనే సారా అలీఖాన్‌తోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం కరీష్మాను ఎన్‌సీబీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా, నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్, డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్టాలను కూడా వచ్చే వారంలో విచారించే అవకాశం ఉంది. సుశాంత్‌ కేసులో రియా చక్రవర్తి సహా పలువురిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు