పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ఆపై

22 Oct, 2020 20:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పరిచయస్తుల చేతిలో లైంగిక దాడికి గురైన వారు 37 శాతం మంది

లక్నో/న్యూఢిల్లీ: హథ్రాస్‌ దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న అకృత్యాలు, అమానుష ఘటనలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అణగారిన వర్గాల స్త్రీలపై జరుగుతున్న భౌతిక దాడులు, హింసాత్మక ఘటనల పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో జాతీయ నేరగణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. గతేడాది మృగాళ్ల చేతిలో లైంగిక దాడికి గురైన బాధితుల్లో 57 శాతం మంది మహిళలు పెళ్లి పేరిట మోసపోయినట్లు వెల్లడించింది. ఇక 37 శాతం రేప్‌ కేసుల్లో నిందితులు, బాధితులకు పరిచయం ఉన్నవారేనని పేర్కొంది. కేవలం ఆరు శాతం కేసుల్లో అపరిచితుల చేతుల్లో స్త్రీలు లైంగిక దోపిడీకి గురైనట్లు తెలిపింది. (చదవండి: మహిళలపై పెరుగుతున్న క్రైమ్‌)

ఈ నేపథ్యంలో యూపీ అదనపు డీజీపీ(ప్రాసిక్యూషన్‌) అశుతోష్‌ పాండే ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమపై జరిగిన అకృత్యాల గురించి మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా నేరస్తులకు శిక్ష వేయించే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో వాళ్లు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతీ ఒక్కరు చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ శక్తి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. మృగాళ్ల పట్ల తాము కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నామని, మెజారిటీ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని పాండే తెలిపారు. 

తద్వారా మహిళలపై జరుగుతున్న నేరాల్లో నిందితుల పట్ల సింహస్వప్పంగా మారిన రాష్ట్రాల్లో 55 శాతం కన్విక్షన్‌ రేటుతో యూపీ ప్రథమస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ జాబితాలో ఉత్తరాఖండ్‌(50 శాతం), రాజస్తాన్‌(45.5శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు వెల్లడించారు.అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఎప్పటికప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్‌ పర్యవేక్షిస్తూ ప్రాసిక్యూషన్‌ డిపార్టుమెంటు సమర్థవంతగా పనిచేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. వివిధ రకాల నేరాల్లో అరెస్టైన, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

గడిచిన 24 గంటల్లో 11 మందికి జీవితఖైదు
గడిచిన ఇరవై నాలుగు గంటల్లో స్థానిక కోర్టులు 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు పాండే తెలిపారు. ‘‘సంభాల్‌లో తన తల్లిని అత్యంత దారుణంగా 17సార్లు పొడిచి చంపిన ఆకాశ్‌, ఆమేథీలో తన పదకొండేళ్ల కొడుకును చంపిన శివబహదూర్‌, ఆమ్రోహాలో దోపిడీకి వెళ్లి ఓ చిన్నారిని హతమార్చిన నలుగురికి, అయోధ్యలో మరో వ్యక్తి సహా మరికొంతమందికి శిక్ష విధించారు’’అని పేర్కొన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించిన 86 కేసుల్లో 90 మంది నిందితులకు బెయిలు రద్దు అయినట్లు వెల్లడించారు. మహిళల భద్రత, వారికి న్యాయ సహాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం హెల్‌‍్పలైన్‌ ఏర్పాటు చేసినట్లు పాండే తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు