ముంబైకి జాతీయ మహిళా కమిషన్‌ బృందం

13 Sep, 2021 04:04 IST|Sakshi

ముంబై: ముంబైలో ఇటీవల ఓ మహిళపై పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వ్యవహారంపై కేంద్ర జాతీయ మహిళా కమిషన్‌ బృందం ముంబై చేరుకుంది. బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించిందని పోలీసులు వెల్లడించారు. నగరంలోని సాకినాక ప్రాంతంలో నివాసముంటున్న బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని రాజవాది ఆస్పత్రికి వెళ్లారు. బాధితురాలు మరణించే వరకు అక్కడే 36 గంటల పాటు ప్రాణాల కోసం పోరాడారు. అక్కడ వైద్యుల నుంచి పలు వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం సాకినాక పోలీస్‌ స్టేషన్‌కు కూడా వెళ్లారు. కేసుకు సంబంధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యాచార కేసుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ సంజయ్‌ పాండేని కలిసిందని అధికారులు వెల్లడించారు. ఆర్థిక రాజధానిలో జరిగిన ఈ ఘటన 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచారంలాగే అత్యంత అమానవీయంగా జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు