ఆస్పత్రి నిర్లక్ష్యం.. ప్రసవం కాకుండానే బిడ్డనిచ్చారు

30 Mar, 2021 08:49 IST|Sakshi

పుట్టిన శిశువును మరో మహిళకు అప్పగింత

తల్లి ప్రశ్నించడంతో తిరిగి అప్పగించిన సిబ్బంది

హుజూరాబాద్‌ రూరల్‌: స్థానిక ఏరియా ఆస్పత్రిలో అప్పుడే జన్మించిన శిశువును తల్లికి కాకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో మహిళకు అప్పగించారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్‌ గ్రామానికి చెందిన రజిత ప్రసవం కోసం హుజూరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆడశిశువుకు జన్మనివ్వగా కింది స్థాయి సిబ్బంది రచన అనే మహిళ కుటుంబ సభ్యులకు అందజేశారు. కానీ రచనకు ఇంకా ఆపరేషన్‌ జరగలేదు. ఆపరేషన్‌ అనంతరం రజిత వద్ద పాప లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

వెంటనే వైద్యసిబ్బంది అప్రమత్తమై రచన కుటుంబ సభ్యుల వద్ద నుంచి పాపను తీసుకొచ్చి రజిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాప మరొకరికి ఎలా ఎలా అప్పగిస్తారంటూ రజిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రజిత కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ రమేష్‌ మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బంది మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని, శిశువును తిరిగి తల్లికి అప్పగించామని తెలిపారు.
చదవండి: వివాహేతర సంబంధం: బాలుడి దారుణ హత్య

మరిన్ని వార్తలు