అదే కాంట్రాక్టర్‌.. అదే నిర్లక్ష్యం.. 

6 Jun, 2021 14:18 IST|Sakshi

హైదరాబాద్‌: ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే హడావిడి చేయడం, ఆ తర్వాత మరిచిపోవడం పాలకులకు పరిపాటిగా మారింది. తప్పు చేసినట్లు తేలిన అధికారులు, కాంట్రాక్టర్లపైన కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు మళ్లీ రిపీట్‌ అవుతున్నాయి. శనివారం బోయిన్‌పల్లిలో నాలాలో పడి బాలుడి మృతి చెందిన ఘటనలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

అయితే ఇదే కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల ఐదేళ్ల క్రితం కూడా ఓ నిండుప్రాణం బలైంది. 2015–16లో సెంటర్‌ పాయింట్‌– అశోక్‌నగర్‌ చౌరస్తా మార్గంలోని ఫిలిప్స్‌ బ్రిడ్జి పునర్‌ నిర్మాణ పనుల సందర్భంగా కూడా కాంట్రాక్టర్‌ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదు. దీంతో 2016 సెప్టెంబర్‌లో రాకేశ్‌ అనే వ్యక్తి నాలాలో పడి మృతి చెందాడు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్, బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని అధికారులు హామీ ఇచ్చారు. కొద్దిరోజుల్లోనే కంటోన్మెంట్‌ నిబంధనల మేరకు బాధితులకు నష్టపరిహారం ఇచ్చే అవకాశం లేదని బోర్డు తీర్మానం చేసి చేతులు దులుపుకొంది. కాంట్రాక్టర్‌పైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మళ్లీ అదే కాంట్రాక్టర్, అదే నిర్లక్ష్య వైఖరి కారణంగా బాలుడు బలయ్యాడు. ఈ సారైనా బోర్డు అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాలి.  

ఈ నిర్లక్ష్యాన్ని ఏమనాలా?
బోయినపల్లి ఘటనలో నాలాకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పటికీ, నాలాలో పడిపోకుండా ఎలాంటి బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. పెద్దలు జాగ్రత్తగా ఉండేందుకైనా కనీసం ప్రమాదహెచ్చరిక బోర్డులు కూడా లేవు.  ఇది కంటోన్మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న పని కాగా, నగరంలోని చాలా నాలాలకు ప్రమాదాలు జరగకుండా పైకప్పు లు కానీ, ఇతరత్రా రక్షణ ఏర్పాట్లు కానీ లేవు. ఏ సంస్థ పరిధిలోనివైనా నగరంలో నాలాలు ప్రమాదకరంగా ఉన్నాయి. పైకప్పులు కానీ, మెష్‌లు కానీ లేక పలు సందర్భాల్లో పలువురు నాలాల్లో పడుతున్నారు.  

వానొస్తే వరద ప్రవాహం సాఫీగా వెళ్లాల్సిన నాలాలు బాలల ప్రాణాల్ని బలిగొంటున్నాయి. అడుగు తడబడో.. ఆడుకోవడానికి వెళ్లో.. ప్రమాదమని తెలియకో నాలాల వైపు వెళ్తున్న అమాయక పసిపిల్లలకు నూరేళ్లు నిండుతున్నాయి. పిల్లలే కాదు.. పెద్దలు సైతం నాలాల్లో పడి  కొట్టుకుపోయి మరణించిన ఘటనలు నగరానికి కొత్తకాదు.  అయినప్పటికీ, సంబంధిత విభాగాల అధికారుల బాధ్యతారాహిత్యంతో నాలాల్లో మరణాలు చర్వితచరణమవుతున్నాయి.  గత సంవత్సరం నేరేడ్‌మెట్‌  ప్రాంతానికి 
చెందిన పన్నెండేళ్ల సుమేధ మరణించగా, ప్రస్తుతం బోయిన్‌పల్లి ప్రాంతంలోని చిన్న తోకట్టకు చెందిన ఏడేళ్ల  ఆనంద్‌సాయి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. 
– సాక్షి, సిటీబ్యూరో

కేటీఆర్‌ ప్రకటించినా... 
గత సంవత్సరం సుమేధ మరణంతో స్పందించిన మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రాణాంతకంగా మారిన నాలాలకు 2 మీటర్ల లోపు వాటికి పైకప్పులు వేస్తామని, అంతకంటే పెద్దవాటిల్లో ప్రమాదాలు జరగకుండా మెష్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. యుద్ధప్రాతిపదికన దాదాపు రూ. 300 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం కుంటుతున్నాయి. దాదాపు 170 కి.మీ.ల మేర నాలాల పనులకు ఈనిధులు కేటాయించగా, ఇప్పటి వరకు దాదాపు 35 కి.మీ.ల మేర పనులు మాత్రమే జరిగాయి. వేసవిలోగానే పనులు పూర్తికావాల్సి ఉండగా, పూర్తికాలేదు. అన్ని జోన్లలో వెరసి 60 పనులు ఇంకా టెండరు దశ దాటలేదు.  

వీటిల్లో .. 2 మీటర్ల వెడల్పు లోపు నాలాలు
పనులు: 121 కి.మీ. 
పూర్తయింది: 23 కి.మీ. 
2 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు నాలాలు 
పనులు: 40 కి.మీ. 
పూర్తయింది: 12 కి.మీ. 

మరిన్ని వార్తలు