పక్కా ప్రణాళికతోనే ప్రాణాలు తీశాడు.. 

20 May, 2022 04:39 IST|Sakshi
తుపాకీపై ఉన్న గుర్తులను చూపుతున్న నెల్లూరు క్రైమ్స్‌ ఏఎస్పీ చౌడేశ్వరి

తనతో పెళ్లికి నిరాకరించిందనే కావ్యశ్రీని హత్య చేసిన సురేష్‌రెడ్డి  

గతేడాది డిసెంబర్‌లో బిహార్‌లో తుపాకీ కొనుగోలు   

అదును చూసి హత్య.. అదే తుపాకీతో తానూ ఆత్మహత్య    

తుపాకీ విక్రయ కేసులో నిందితుడి అరెస్ట్‌.. వివరాలు వెల్లడించిన నెల్లూరు క్రైమ్స్‌ ఏఎస్పీ  

నెల్లూరు(క్రైమ్‌): తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో కావ్యశ్రీని చంపడమే లక్ష్యంగా సురేష్‌రెడ్డి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.. బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసి నెల్లూరు వచ్చాడు.. అదును కోసం వేచి చూసి ఈ నెల 9న ఆమెను తుపాకీతో కాల్చి చంపి.. ఆపై తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీని ఎక్కడ, ఎవరి వద్ద కొనుగోలు చేశాడు.. తదితర వివరాలను సేకరించిన పోలీసులు బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఆ వివరాలను గురువారం నెల్లూరు క్రైమ్స్‌ ఏఎస్పీ చౌడేశ్వరి మీడియాకు వివరించారు. పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన కావ్యశ్రీ.. అదే ప్రాంతానికి చెందిన సురేష్‌రెడ్డితో పెళ్లికి నిరాకరించడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గతేడాది ఆగస్టులో ఆమెకు సురేష్‌రెడ్డి మెసేజ్‌ పంపాడు. దానికి ఆమె స్పందించకపోవడంతో ఎలాగైనా  అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. యాసిడ్‌తో దాడి, హత్యచేయడంపై ఇంటర్నెట్‌లో వీడియోలు చూశాడు.

చివరకు తుపాకీతో కాల్చి చంపాలని నిర్ణయించుకుని, ఆ సమాచారం కోసం నెలల తరబడి డార్క్‌ నెట్‌లో శోధించాడు. బిహార్‌లో తుపాకులు దొరుకుతాయని తెలుసుకుని గతేడాది డిసెంబర్‌లో పాట్నాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే పాట్నా పున్‌పున్‌ పోస్టు కందాప్‌ గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ రమేష్‌కుమార్‌ అలియాస్‌ రోహిత్, అతని అన్న ఉమేష్‌ల నుంచి తుపాకీని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి అదును కోసం వేచి చూసి చివరికి కావ్యశ్రీని కాల్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆ కోణంలో దర్యాప్తు 
ఘటనపై శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. అసలు సురేష్‌ రెడ్డికి తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సురేష్‌రెడ్డి సెల్‌ఫోను మెసేజ్‌లు, కాల్‌ డేటా, ట్రావెల్‌ హిస్టరీని సేకరించారు. మృతుడు గతేడాది డిసెంబర్‌లో బిహార్‌లోని ఓ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.89,500 విత్‌డ్రా చేసినట్టు గుర్తించారు. తుపాకీ పైనున్న( స్టార్‌) గుర్తుల ఆధారంగా దానిని బిహార్‌లోనే కొనుగోలు చేసినట్టు నిర్ధారణకొచ్చారు.

ప్రత్యేక బృందాలు పాట్నాకు వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో.. తుపాకీని విక్రయించిన అన్నదమ్ముల్లో ఒకడైన రోహిత్‌కు నెల్లూరు వచ్చి విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. దీంతో రమేష్‌ ఈ నెల 17న నెల్లూరు వచ్చి సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యాడు. రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు గురువారం అతడిని అరెస్ట్‌ చేశారు. అతడిచ్చిన సమాచారం మేరకు అతడి అన్న ఉమేష్‌ కోసం గాలిస్తున్నట్టు క్రైమ్స్‌ ఏఎస్పీ చౌడేశ్వరి వివరించారు. 

మరిన్ని వార్తలు